ఆర్టీసీ బస్​చార్జీల పెంపుపై ఎండీ సజ్జనార్ ​క్లారిటీ

ఆర్టీసీ బస్​చార్జీల పెంపుపై ఎండీ సజ్జనార్ ​క్లారిటీ

హైదరాబాద్, వెలుగు: టీజీఎస్ ఆర్టీసీ.. బ‌‌స్ చార్జీలను పెంచింద‌‌ని జ‌‌రుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని సంస్థ ఎండీ సజ్జనార్ ​తెలిపారు. రెగ్యుల‌‌ర్ స‌‌ర్వీస్‌‌లకు సాధార‌‌ణ చార్జీలే అమ‌‌ల్లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. దీపావ‌‌ళి తిరుగు ప్రయాణ  ర‌‌ద్దీ నేప‌‌థ్యంలో ఏర్పాటు చేసిన స్పెష‌‌ల్ బ‌‌స్సుల్లో మాత్రమే ప్రభుత్వ జీవో  ప్రకారం చార్జీల‌‌ను సంస్థ స‌‌వ‌‌రించిందని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల ర‌‌ద్దీ ఉండ‌‌క‌‌పోవ‌‌డంతో ఆ బ‌‌స్సులు ఖాళీగా వెళ్తుంటాయని, ఆ స్పెష‌‌ల్ బ‌‌స్సుల‌‌కు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధ‌‌ర‌‌ను స‌‌వ‌‌రించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందన్నారు.  

పండుగ‌‌లు, ప్రత్యేక సంద‌‌ర్భాల్లో న‌‌డిచే స్పెష‌‌ల్ బ‌‌స్సుల్లో మాత్రమే రూ.1.50 వ‌‌ర‌‌కు టికెట్ ధ‌‌ర‌‌ల‌‌ను స‌‌వ‌‌రించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చిందని,  ఇది 21 ఏండ్లుగా ఆన‌‌వాయితీగా వ‌‌స్తున్న ప్రక్రియని పేర్కొన్నారు. దీపావ‌‌ళి పండుగ స‌‌మ‌‌యంలో తిరుగు ప్రయాణంలో క‌‌రీంన‌‌గ‌‌ర్, వ‌‌రంగ‌‌ల్, ఖ‌‌మ్మం, త‌‌దిత‌‌ర ప్రాంతాల నుంచి హైద‌‌రాబాద్‌‌కి ర‌‌ద్దీ ఎక్కువ‌‌గా ఉందని, ఈ నేప‌‌థ్యంలో ఆది, సోమ‌‌వారం  ర‌‌ద్దీకి అనుగుణంగా రాష్ట్రంలోని ప‌‌లు ప్రాంతాల‌‌ నుంచి హైద‌‌రాబాద్‌‌కు ప్రత్యేకంగా  బ‌‌స్సుల‌‌ను న‌‌డపాల‌‌ని యాజ‌‌మాన్యం నిర్ణయించిందన్నారు.

  ఆదివారం  క‌‌రీంన‌‌గ‌‌ర్ రీజియ‌‌న్ నుంచి 127, రంగారెడ్డి నుంచి 105, వ‌‌రంగ‌‌ల్ నుంచి 66, ఆదిలాబాద్ నుంచి 16 మొత్తంగా 360 ప్రత్యేక  బ‌‌స్సుల‌‌ను హైద‌‌రాబాద్‌‌కు సంస్థ న‌‌డిపిందని చెప్పారు.  సోమ‌‌వారం సాయంత్రం వ‌‌ర‌‌కు ఆయా ప్రాంతాల‌‌ నుంచి మ‌‌రో 147  స‌‌ర్వీసుల‌‌ను ఏర్పాటు చేసిందని, ఈ స్పెష‌‌ల్ బ‌‌స్సుల్లో మాత్రమే జీవో ప్రకారం చార్జీల‌‌ను స‌‌వ‌‌రించిందన్నారు.