![మహిళలు, బాలికల భద్రతకు చర్యలు](https://static.v6velugu.com/uploads/2025/02/bharosa-kendras-and-awareness-programs_JdpF9gaxfN.jpg)
వనపర్తి, వెలుగు: భరోసా కేంద్రం ద్వారా మహిళలు, బాలికలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి అవసరమైన న్యాయం చేస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. అత్యాచార బాధితులకు పోలీస్ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో వివిధ రకాల సేవలు అందిస్తున్న భరోసా కేంద్రం ప్రథమ వార్షికోత్సవాన్ని గురువారం జరుపుకున్నారు. ఎస్పీ రావుల గిరిధర్ తో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలను దృష్టిలో ఉంచుకొని, అన్ని రకాల సేవలను ఒకే దగ్గర అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఎస్పీ మాట్లాడుతూ భరోసా కేంద్రం ద్వారా మహిళలు, బాలికలపై అత్యాచారాలను నియంత్రించేందుకు స్కూల్, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోక్సో కేసు నమోదైనప్పటి నుంచి బాధితులకు అండగా ఉంటూ, నిందితులకు శిక్ష పడేలా చేయడమే భరోసా కేంద్రం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, వనపర్తి సీఐ కృష్ణ, ఎస్సైలు హరిప్రసాద్, బాలయ్య, సురేందర్, భరోసా కేంద్రం కో ఆర్డినేటర్ శిరీష, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాంబాబు పాల్గొన్నారు.
మైనర్లను పనిలో పెట్టుకోవద్దు
నాగర్ కర్నూల్ టౌన్: మైనర్లను పనిలో పెట్టుకుంటే చర్యలు తీసుకుంటామని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ హెచ్చరించారు. గురువారం నాగర్ కర్నూల్ భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో భరోసా సెంటర్ పెట్టి ఏడాది పూర్తయిందన్నారు. మహిళలకు భరోసా సెంటర్ ద్వారా అండగా ఉంటున్నామని తెలిపారు. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా మైనర్లను పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేసి చిన్నపిల్లలకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. అడిషనల్ ఎస్పీ సీహెచ్ రామేశ్వర్, డీఎస్పీ సత్యనారాయణ, సీఐ కనకయ్య, ఎస్సై గోవర్ధన్ పాల్గొన్నారు.