పులుల అడ్డాగా నల్లమల

పులుల అడ్డాగా నల్లమల
  • ఏటీఆర్​లో రెండేళ్లలో గణనీయంగా పెరిగిన పులుల సంఖ్య
  • సత్ఫలితాలనిస్తున్న అటవీ శాఖ చర్యలు 
  • శాఖాహార జంతువుల సంతతి అభివృద్ధిపై దృష్టి
  • మద్దిమడుగు దగ్గర జింకల అభయారణ్యం ఏర్పాటు

నాగర్​కర్నూల్, వెలుగు: నల్లమల అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. నల్లమల పరిధిలోని అమ్రాబాద్​ టైగర్​ రిజర్వ్​లో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రెండేండ్లలో వీటి సంఖ్య 34కు చేరింది. 2022 గణాంకాల ప్రకారం 21 వరకు ఉన్న పులుల సంఖ్య 2023 జూన్​ నాటికి దాదాపు 30కి చేరింది. 2024 గణంకాల ప్రకారం నల్లమల పరిధిలోని ఏటిఆర్​తో పాటు కొల్లాపూర్​ రేంజ్​లోనూ పులుల సంఖ్య పెరిగింది. నల్లమలలో ప్రస్తుతం 34 పెద్దపులులు ఉన్నట్లు అంచనా.

 వీటిలో 11 మగ పులులు,15 ఆడపులులు,8 పిల్లలు ఉన్నాయి. పులులతో పాటు చిరుతల సంఖ్య 175కు చేరింది. ఏటీఆర్​ తర్వాత కొల్లాపూర్  రేంజ్​ పరిధిలో 8 పులులు సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఇందులో ఒక మగ పులి, రెండు ఆడ పులులు, 5 పిల్లలు ఉన్నాయి. గత ఏడాదిలో ఇదే రేంజ్​లో చిరుతల సంఖ్య పెరిగింది. పెరుగుతున్న పులులు, చిరుతల సంఖ్యకు అనుగుణంగా వాటి ఆహార అవసరాలను గుర్తించిన అటవీశాఖ అధికారులు మద్దిమడుగు వద్ద జింకల అభయారణ్యం ఏర్పాటుపై దృష్టి సారించారు.

కొల్లాపూర్, లింగాల​రేంజ్​ పరిధిలోనూ.. 

ఏటీఆర్​ తరువాత పులుల సంచారం కొల్లాపూర్, లింగాల రేంజ్​ పరిధిలోనే ఎక్కువగా ఉంది. కొల్లాపూర్​ మండలంలోని ముక్కిడిగుండం, మొలచింతలపల్లి, నార్లాపూర్, చంద్రబండతాండా నుంచి లింగాల రేంజ్​ మధ్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. పులుల సంఖ్య పెంచేందుకు రెండేండ్లుగా తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. ఎనిమల్​ మేటింగ్​ టైంలో నల్లమలలో మూడు నెలల పాటు అన్ని క్లోజ్​ చేస్తున్నారు. పులులు సంచరించే ప్రాంతంలో వాటర్​ సాసర్స్, ఆహారానికి ఎటువంటి కొరత రాకుండా చూస్తున్నారు. 

కదలికలను గుర్తించేందుకు..

పులులు, ఇతర వన్యప్రాణుల కదలికలను గుర్తించేందుకు నల్లమలలో 500 ట్రాప్​ కెమెరాలు ఏర్పాటు చేస్తే.. కృష్ణా తీరంలోని కొల్లాపూర్​ రేంజ్​ పరిధిలోని అడవిలో 50 కెమెరాలు, లింగాల రేంజ్​లో 30  కెమెరాలు ఉన్నాయి. పుటేజీ​ఆధారంగా పులుల పాద ముద్రలు సేకరిస్తారు. వాటి ఆధారంగా పూర్తి వివరాలను రికార్డ్​ చేస్తున్నారు. కొల్లాపూర్,​ -లింగాల రేంజ్​ల మధ్య ఉన్న డీప్​ ఫారెస్ట్​లో వీటి కదలికలు గుర్తించారు. 

కొల్లాపూర్​ మండలం ముక్కిడిగుండం, మొలచింతలపల్లి, నార్లాపూర్, చంద్రబండ తండా పరిసరాల్లోనూ పులుల కదలికలు ఉన్నట్లు కెమెరాల్లో రికార్డు అయింది. నల్లమల, కృష్ణా పరివాహక ప్రాంతంలో రివర్​ పెట్రోలింగ్, కలప స్మగ్లింగ్, జంతువులను కాపాడేందుకు రెగ్యులర్​ సిబ్బంది, బేస్​ క్యాంప్​ వాచర్లు పని చేస్తున్నారు. పులులు కదలికలకు అనుగుణంగా కొత్త బేస్​ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు.

పులుల సంరక్షణపై నజర్..

నల్లమల పరిధిలో పులులు, ఇతర వన్యప్రాణుల సంరక్షణకు 30 బేస్​ క్యాంపులు ఏర్పాటు చేశారు. 250 మంది వాచర్లు, వివిధ స్థాయిల్లో పని చేసే అటవీ సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. 8 రేంజ్​ల పరిధిలో 500 ట్రాప్​ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం వాటి కదలికలు గమనిస్తుంటారు. నల్లమల కొండల మధ్య సహజంగా ఏర్పడే నీటి చెలిమలు, వాగులు ఉన్నాయి.

 కృష్ణా నది పరివాహక ప్రాంతాలు పులుల ఆవాసాలుగా మారుతున్నాయి. ఒక పులి ఎదుగుదలకు ఏడాదికి 400  జింకలు అవసరం అవుతాయని అంచనా. ప్రస్తుతం ఉన్న పులులు, చిరుతల ఆహారం కోసం శాఖాహార జంతు సంతతి పెంచే పనిలో పడ్డారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంటూ జంతువులను వేటాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ​ 

పులుల సంఖ్య సెంచరీ దాటిస్తాం..

నల్లమలలో పులుల సంఖ్య పెరగడం సంతోషం. వీటి సంఖ్యను 100 వరకు పెంచుతాం. పులులు,చిరుతల ఆహారం కోసం జింకలు, శాఖాహార జంతు సంతతి అభివృద్ధి చేయాలి. మద్దిమడుగు వద్ద జింకల అభయారణ్యం ఏర్పాటు చేయడానికి ప్రపోజల్స్​ రెడీ చేశాం. నల్లమలలో గ్రాస్​ ల్యాండ్స్​ పెంచాల్సి ఉంది. 

ఇతర ప్రాంతాల నుంచి అడవిలోకి అక్రమంగా చొరబడకుండా రివర్​ పెట్రోలింగ్​ చేస్తున్నాం. ఎం స్ర్కిప్ట్​ యాప్​ను వాడుతున్నాం. అడవిని కాపాడుకోవడంలో కమ్యూనిటీ మేనేజ్​మెంట్​ కీలకం. శ్రీశైలం ఎలివేటర్​ కారిడార్​ ఏర్పాటైతే నల్లమల మరింత సురక్షితంగా ఉంటుంది.- రోహిత్​ గోపిడి, డీఎఫ్​వో