వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలి

ఖమ్మం టౌన్, వెలుగు : రాబోయే వేసవిలో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్‌‌ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఈ విషయమై శుక్రవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్​ హాల్​ లో ఆర్‌‌డబ్ల్యూఎస్‌‌, పబ్లిక్‌‌ హెల్త్‌‌, ఇరిగేషన్, విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.  నాలుగు మున్సిపాలిటీలు, 589 గ్రామాల్లో నీటి వనరులను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో అమృత్ పథకం కింద 18 ఈఎల్ఎస్ఆర్  నిర్మాణాలు చేపట్టి 16 పూర్తిచేసుకుని వాడకంలోకి తెచ్చామన్నారు. మిగతా 2 నిర్మాణాలు వారం లోపు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సూచించారు. 685 కిలోమీటర్ల మేర పైప్ లైన్ ఏర్పాటు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో ఒక ఈఎల్ఎస్ఆర్, 27.42 కిలోమీటర్ల పైప్ లైన్ పనులు మంజూరు చేసుకొని 93 శాతం మేర పూర్తయ్యాయని చెప్పారు. 

మధిర పట్టణంలో 104.01 కిలోమీటర్ల పైప్ లైన్, 5 నిర్మాణాలు మంజూరు చేసుకొని 91 శాతం పనులు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. మిగతా పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. తాగునీటి సరఫరా పనుల మంజూరుకు ప్రతిపాదనలు ఉన్నచోట వెంటనే సమర్పించాలన్నారు. సమావేశంలో ఖమ్మం మున్సిపల్​ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ రంజిత్, మిషన్ భగీరథ ఎస్ఈ సదా శివకుమార్, ఈఈలు పుష్పలత, వాణిశ్రీ, ఇర్రిగేషన్ ఈఈ వెంకటేశ్వర రావు, మున్సిపల్, విద్యుత్, ఇర్రిగేషన్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. 
 

పొరపాట్లు లేకుండా నమోదు చేయాలి.
 

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రజాపాలన దరఖాస్తులను కట్టుదిట్టంగా ఎలాంటి పొరపాట్లు లేకుండా ఆన్ లైన్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ సూచించారు. శుక్రవారం  స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో ప్రజా పాలన దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేసే అంశంపై జిల్లా కలెక్టర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులను డేటా ఎంట్రీ ఆపరేటర్లు ప్రజాపాలన వెబ్ సైట్ లో నమోదు చేయాలని సూచించారు. ఎంపీడీవో, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో మాత్రమే ఆన్​లైన్ ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. యూజర్ ఐడీ, లాగిన్లు సీక్రెట్​గా ఉంచాలని సూచించారు.