తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా దాదాపు లక్షా పది వేల మంది నేత కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో సుమారు లక్షకుపైగా కార్మికులు పద్మశాలి కులానికి చెందినవారే. ఈ సామాజిక వర్గం నుండి తొలితరంలో కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆలె నరేంద్ర, మొదలైనవారు వివిధ రాజకీయ పదవుల్లో ఉన్నప్పుడు చేనేత రంగ అభివృద్ధికి, నేతన్నల సంక్షేమం కోసం పాటుపడ్డారు. కానీ ఇప్పుడు ఈ సామాజిక వర్గం నుండి రమణ ఒక్కరే ఎంఎల్‌సిగా ఉన్నందువల్ల, రాజకీయంగా అంతగా బలం లేకుండాపోయింది. అయితే రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాజకీయ బలాబలాలతో సంబంధం లేకుండా, తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఇచ్చిన వాగ్ధానాలను, ఎన్నికల మ్యానిఫెస్టోల్లో పొందుపరిచిన హామీలను నెరవేర్చితే కునారిల్లుతున్న చేనేత రంగాన్ని పునరుద్ధరించవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలు
నేతన్నలను నేరుగా ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవాలి. వినైల్ ఫ్లెక్స్ ప్రింటింగులను దశలవారీగా బందుచేయించి, ‘బట్టతో చేసిన బ్యానర్’ లను ప్రోత్సహించాలి. దీనివల్ల నేతకార్మికులకు పని కల్పించడమే కాకుండా, పర్యావరణాన్ని పరిరక్షించినట్లవుతుంది. ఈ విషయంలో ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం ఆదర్శనీయం, అభినందనీయమే కాక తెలంగాణ వంటి రాష్ట్రాలకు అనుసరణీయం కూడాను. ఉన్నత విద్యాసంస్థల్లో స్నాతకోత్సవానికి వాడే వస్త్రాలను పూర్తిగా నూలు (కాటన్) తో మగ్గాలపై చేతితో నేసిన వాటినే వాడేలా ఆదేశాలు జారీ చేయాలి. ఎన్నో విషయాల్లో ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం, ఈ చొరవలు కూడా తీసుకోవాలి. రాష్ట్రంలో ఉన్న 334 చేనేత సహకార సంఘాల్లో 2013 లో ఎన్నికయిన పాలకవర్గమే ఇంకా కొనసాగుతుంది. అందువల్ల వాటికి తక్షణమే ఎన్నికలు నిర్వహించి, మార్కెటింగ్ నిమిత్తం ఒక్కో సంఘానికి ఒక్కో వ్యాను/మినీ ట్రక్కును ప్రభుత్వమే అందించాలి. దీనివల్ల వారి సంఘాల్లో ఉత్పత్తి అయిన వస్త్రాలను వారికి దగ్గరగా ఉండే అంగళ్ళలో, జాతర్లలో, ఇతర ఉత్సవాల్లో ‘మొబైల్ ఔట్లెట్’ పెట్టి అమ్మడానికి వీలుకలుగుతుంది. ఆసక్తి కనబరిచే మాస్టర్ వీవర్లకు, స్వతంత్ర వీవర్లకు కూడా ఈ వాహనాలను 50% సబ్సిడీతో అందించాలి. నూలు రేటు తగ్గించి, మీటరుకిచ్చే నేతకూలీని పెంచాలి. రాష్ట్రంలో పత్తి ఉత్పత్తి గణనీయంగా ఉంది. కావున వరంగల్ లో స్పిన్నింగ్ మిల్లులు ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం పూనుకోవాలి. అన్ని ప్రభుత్వ ఆఫీసులకు అవసరమైన వస్త్రాలు, ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు ఉచితంగా అందించే స్కూల్ యూనిఫాంలు, ప్రభుత్వ వసతిగృహాల్లో వాడే బెడ్షీట్లు, టవల్లు మొదలైనవి, ప్రైవేట్ స్కూళ్ళల్లో విద్యార్థులు వాడే స్పోర్ట్స్ డ్రస్ లాంటి వాటికన్నింటికీ చేనేత వస్త్రాలనే వాడాలని ప్రభుత్వం లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వాలి. చలి కాలంలో వెచ్చదనాన్ని, ఎండాకాలంలో చల్లదనాన్నిచ్చే చేనేత వస్త్రాల యొక్క విలక్షణ గుణాన్ని, దాని ప్రత్యేకతను ప్రజలందరికీ అర్థమయ్యేలా చేనేత సంఘాలు ప్రచారం చేయాలి. వివిధ పండుగల సందర్భాల్లో రాష్ట్రంలోని ప్రజలందరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసేలా వాటి ధరలపై ప్రత్యేక రిబేట్లను ప్రకటించాలి. అలాగే, ప్రతి వ్యక్తికి ప్రత్యేక సందర్భాలైన పుట్టిన రోజు, పెళ్ళి రోజు, ఇతర జ్ఞాపకార్థపు రోజుల్లో ప్రజలు చేనేత వస్త్రాలు విరివిగా కొనేలా ప్రోత్సహించాలి.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో..
పార్లమెంట్ ఆమోదించిన హాండ్లూమ్ రిజర్వేషన్ ఆక్ట్-1985 ప్రకారం 11 రకాల వస్త్రోత్పత్తులను పవర్ లూమ్ పై నేయ కూడదు. కానీ చాలా చోట్ల కొందరు స్వార్థపర యజమానులు పవర్ లూమ్ లపై కూడా రిజర్వ్ వస్త్రాలను నేసి చేనేతపైనే ఆధారపడ్డ కార్మికుల పొట్టకొడుతున్నారు. దీనిని కూడా కేంద్రప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరముంది. మధ్యవర్తులను తొలగించడానికి చేనేత వస్త్రాలను అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మింత్ర, స్నాప్‌డీల్ వంటి ఆన్లైన్ విపణిలో ఉంచాలి. ఈ ‘వీవర్ టు కస్టమర్’ విధానం ద్వారా అటు నేతన్న, ఇటు వినియోగదారుడు బాగుపడతారు. దీనివల్ల ధరలు కూడా కొంత తగ్గి, చాలామంది వినియోగదారులు షాపులకు వెళ్ళకుండానే ఇంటివద్ద నుంచే కొనుగోలు చేస్తారు. యువతను చేనేత రంగం వైపు ఆకర్షించడానికి వరంగల్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీని నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. నేత కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధికి ప్రతీ సంవత్సరం తగిన బడ్జెట్ కేటాయించాలి. చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీ లో వచ్చే రాష్ట్రవాటాను నేతన్నల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తూనే, ఆ పన్నును మొత్తమే రద్దు చేసేలా ఇతర రాష్ట్రాల సమన్వయంతో కేంద్రాన్ని ఒప్పించాలి. అప్పుడే నేతన్నలు సుభిక్షంగా ఉంటూ తెలంగాణ రాష్ట్రాన్ని చేనేత వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధికెక్కేలా చేస్తారు.
-డా. శ్రీరాములు గోసికొండ,అసిస్టెంట్ ప్రొఫెసర్, నర్సీ మోంజీ డీమ్డ్ యూనివర్సిటీ, జడ్చర్ల