హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న మాసం వ్యాపారులు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం టౌన్​లో కొత్త మార్కెట్​లోని మాంసం వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. గోదావరి వరద ముంపు బాధితులకు కొత్త మార్కెట్​ప్లేస్​లో డబుల్​బెడ్రూం ఇండ్లు కట్టించాలని సర్కార్​నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న షాపులను నన్నపనేని మోహన్​ హైస్కూల్​ వైపు మార్చాలని కలెక్టర్ ఇటీవల ఆదేశాలిచ్చారు. తాము ఖర్చు పెట్టి నిర్మించుకున్న షెడ్లను ఎలా తొలగిస్తారని 55 షాపుల యజమానులు హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. దీంతో ఆ ప్లేస్​లో కడుతున్న డబుల్​బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి బ్రేక్​పడింది. 

మూడేండ్ల కింద మార్కెట్​ నిర్మాణం

భద్రాచలం టౌన్​లో మాంసం వ్యాపారులకు ఉపయోగపడేలా మూడేండ్ల కింద కొత్తమార్కెట్​ నిర్మించారు. భద్రాచలం పంచాయతీ ఆధ్వర్యంలో మార్కెట్​లో రూ.1.5కోట్లతో డ్రైన్లు, సీసీ రోడ్లు, బోర్లు, కబేళా.. మౌలిక వసతులు కల్పించారు.  ఒక్కో వ్యాపారి సుమారు రూ.1.5లక్షల పెట్టుబడితో షెడ్లు నిర్మించుకున్నారు. ఇలా సుమారు 55షాపులు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు వీటిని తొలగించి ఈ ప్లేస్​లో గోదావరి ముంపు బాధితులకు డబుల్​బెడ్రూం ఇండ్లు నిర్మించాలని సర్కారు ఆలోచన. అందుకే కొత్తమార్కెట్​తోపాటు వ్యవసాయ మార్కెట్​ కమిటీలోని ఖాళీ స్థలాలను సేకరిస్తున్నారు. 

ముంపు బాధితుల నుంచి వ్యతిరేకత 

వరద ముంపు కాలనీలను ఖాళీ చేయించాలనే సర్కారు నిర్ణయంపై బాధితుల నుంచి వ్యతిరేకత వస్తోంది. సర్వేకు వచ్చిన రెవెన్యూ టీంలను బాధితులు అడ్డుకున్నారు. కాలనీలను ఖాళీ చేసేది లేదని కరాఖండీగా చెప్పారు. మొత్తం 2016 డబుల్​బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి సర్కారు ప్లాన్​చేసింది. అయితే వ్యక్తిగత ఇండ్లుగా కాకుండా కాంప్లెక్స్ లు నిర్మించి ఇస్తామని సర్కారు చెప్పడంతో ముంపు బాధితులు వ్యతిరేకిస్తున్నారు. విలువైన తమ భూములను వదిలేసి కాంప్లెక్స్ ల్లోకి వెళ్లమని ఆఫీసర్లకు తెగేసి చెప్పారు. తాజాగా హైకోర్టును స్టే తెచ్చి మాంసం దుకాణదారులు డబుల్​బెడ్​ రూం ఇండ్ల నిర్మాణ ప్రక్రియకు అడ్డుపడటంతో వారు ఊరట చెందారు.