సిద్దిపేట : రాబోయే రోజుల్లో బీ కేటగిరి మెడికల్ అడ్మిషన్లలో లోకల్ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని హెల్త్ మినిస్టర్ హరీశ్‌రావు వెల్లడించారు. దీనివల్ల స్థానిక విద్యార్థులు ఎక్కువ మంది మెడిసిన్ అభ్యసించడానికి అవకాశం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మెడ్ ఎక్స్ పో ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఏ కేటగిరీలోనే లోకల్ రిజర్వేషన్లు అమలుచేస్తున్నామని, గత ప్రభుత్వాలు వైద్యవిద్యను పట్టించుకోకపోవడం వల్ల ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయక పోవడంతో ఎంతో మంది స్టూడెంట్లు విదేశాలకు వెళ్లి మెడిసిన్ అభ్యసించే పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 17 కాలేజీలు స్థాపించామని చెప్పారు.
ఈ ఒక్క సంవత్సరంలోనే ఎనిమిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్ల 1280 మెడికల్ సీట్లు అదనంగా రానున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం వల్ల వేల మంది విద్యార్థులు ఇక్కడే మెడిసిన్ అభ్యసించడానికి అవకాశం కలిగిందన్నారు. ఈ సంవత్సరం నుంచి సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో 48 పీజీ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయని, త్వరలోనే ఈ కాలేజీకి 900 పడకల ఆసుపత్రి కూడా అందుబాటులోకి రానుందని మంత్రి తెలిపారు. అలాగే సిద్దిపేటలో రూ.15 కోట్ల తో క్యాత్ ల్యాబ్, కేన్సర్ పేషెంట్ల కోసం రెడియో, కీమోథెరపీ సేవలను త్వరలోనే ఉచితంగా అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి మంత్రి ఆరా తీశారు.