లంచం కోసం పక్కా స్కెచ్

ఆపరేటర్‌‌ నుంచి తహసీల్దార్‌‌ వరకు తన మనుషులనే పెట్టుకున్న నగేశ్

చిప్పల్‌‌తుర్తి భూముల కేసులో వెలుగు చూస్తున్న నిజాలు
అరెస్టయిన ఐదుగురు ఏసీబీ కోర్టుకు.. 14 రోజుల రిమాండ్

మెదక్/నర్సాపూర్, వెలుగు: లంచం కేసులో అరెస్టయిన మెదక్‌‌ జిల్లా అడిషనల్‌‌ కలెక్టర్‌‌ జి. నగేశ్‌‌.. కోట్ల విలువైన 112 ఎకరాల సర్కారు భూమిని అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులపరం చేసేందుకు పక్కా ప్లాన్‌‌తో వ్యవహరించారు. నర్సాపూర్‌‌ తహసీల్దార్‌‌ ప్లేస్‌‌లో తనకు అనుకూలంగా వ్యవహరించే తహసీల్దార్‌‌ను ఇన్‌చార్జిగా నియమించుకోవడం దగ్గరి నుంచి కంప్యూటర్‌‌ ఆపరేటర్‌‌ను మార్చడం, ఎన్‌‌వోసీకి అప్లికేషన్‌‌ పెట్టగానే చకచకా ఫైల్‌‌ మూవ్‌‌ అయిపోవడం, 112 ఎకరాల ల్యాండ్‌‌పై ప్రొహిబిషన్‌‌ను ఎత్తేయాలని కలెక్టరేట్‌‌ నుంచి రిజిస్ట్రేషన్‌‌ శాఖకు లెటర్‌‌ వెళ్లడం వరకు పక్కాగా జరిగిపోయాయి. ఈ వ్యవహారంలో అడిషనల్​ కలెక్టర్ 1.12 కోట్ల లంచం డిమాండ్ చేసి రూ. 40 లక్షలు తీసుకోవడంతో పాటు 5 ఎకరాల ల్యాండ్ తన బినామీ పేరు మీద సేల్ డీడ్ రాయించుకున్నట్టు ఏసీబీ విచారణలో తేలింది. అలాగే నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి, చిలప్‌‌చెడ్ తహసీల్దార్ అబ్దుల్ సత్తార్‌‌ల పాత్ర ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఈ ప్రొహిబిటెడ్ ల్యాండ్‌‌కు ఎన్‌‌వోసీ వ్యవహారంలో రిటైర్డ్ కలెక్టర్ పాత్ర కూడా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏసీబీ అధికారులు కలెక్టరేట్‌‌లోనూ సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్‌‌లు సీజ్‌‌ చేయడం, కలెక్టర్ పేషీకి తాళం వేయడం అనుమానాలకు బలం ఇస్తోంది.

నర్సాపూర్‌‌ తహసీల్దార్‌‌ 15 రోజులు లీవ్‌‌ పెట్టడంతో..

చిప్పల్‌‌తుర్తిలోని భూమికి ఎన్‌‌వోసీకి నర్సాపూర్ రెగ్యులర్ తహసీల్దార్ మాలతి ససేమిరా అన్నట్టు తెలిసింది. అయితే ఉన్నతాధికారి నుంచి ఒత్తిడి ఎక్కువవడంతో ఆమె జులైలో 15 రోజులు లీవ్ పెట్టారు. ఇదే అదనుగా ఉన్నతాధికారులు తమకు అనుకూలంగా ఉండే సత్తార్‌‌కు నర్సాపూర్ తహసీల్దార్‌‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. చిలప్‌‌చెడ్ తహసీల్దార్.. ఆపరేటర్‌‌ను నర్సాపూర్ ఆఫీస్‌‌కు మార్చడం గమనార్హం.

చకచకా కదిలిన ఫైల్‌‌

చిప్పల్‌‌తుర్తి ల్యాండ్‌‌ ఎన్‌‌వోసీ జారీలో తహసీల్దార్ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు ఫైల్‌‌ చకచకా మూవ్‌‌ అయింది. భూమి కొన్న వాళ్లలో ఒకరైన లింగమూర్తి జులై 22న ఎన్‌‌వోసీ కోసం నర్సాపూర్ తహసీల్దార్ ఆఫీస్‌‌లో అప్లికేషన్ పెట్టగా ఒక్కరోజు కూడా లేట్‌‌ చేయకుండా 23నే ఆ కాపీని నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డికి పంపారు. జులై 25న ఆ ఫైల్‌‌ మెదక్ కలెక్టరేట్‌‌కు ఫార్వర్డ్ అయింది. మెదక్ జిల్లా కలెక్టర్‌‌గా పని చేసిన ధర్మారెడ్డి రిటైర్‌‌ అయిన జులై 31న చిప్పల్‌‌తుర్తి పరిధిలోని సదరు ల్యాండ్‌‌ను ప్రొహిబిషన్ లిస్టు నుంచి తొలగించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌‌ల శాఖకు లెటర్ వెళ్లింది. డిపార్ట్‌‌మెంట్‌‌కు లెటర్ వెళ్లడం వెనుక మరేదైనా మతలబు ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను గురువారం ఏసీబీ జడ్జి ముందు ప్రొడ్యూస్‌‌ చేయగా.. జడ్జి  వాళ్లకు 14 రోజుల జ్యుడీషియల్‌‌ రిమాండ్‌‌ విధించారు.

For More News..

ప్రభుత్వమే ప్రజల పొట్టకొడితే ఎలా?