
- బీఆర్ఎస్ అభ్యర్థి పద్మ కోసం హరీశ్‌రావు వ్యూహాలు
- కొడుకు గెలుపును సవాల్‌గా తీసుకున్న హనుమంతరావు
- తామే క్యాండేట్లు అన్నట్లు హరీశ్, హనుమంతరావు నడుమ మాటల యుద్ధం
మెదక్, వెలుగు: మెదక్అసెంబ్లీ సెగ్మెంట్లో రాజకీయం రసవత్తరంగా మారింది. అటు అధికార బీఆర్ఎస్, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్లీడర్లు సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్హీట్పెంచేస్తున్నారు. కాంగ్రెస్‌నుంచి ఎలాగైనా తన కొడుకును మెదక్‌ఎమ్మెల్యేగా గెలిపించాలని మైనంపల్లి హనుమంతరావు ప్రయత్నిస్తుండగా, అదే స్థాయిలో బీఆర్ఎస్క్యాండిడేట్, సిట్టింగ్ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి గెలుపు కోసం మంత్రి హరీశ్ రావు వ్యూహాలు రచిస్తున్నారు.
సిద్దిపేట బీఆర్ఎస్ అభ్యర్థిగా హరీశ్, మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా హనుమంతరావు పోటీ చేయనున్నప్పటికీ, మెదక్‌లోనూ తామే క్యాండిడేట్లు అన్న రీతిలో రాజకీయం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో అందరి దృష్టి మెదక్‌పై పడేలా విమర్శలు, ప్రతి విమర్శలకు దిగుతున్నారు.
మద్దతు కూడగడుతున్న మైనంపల్లి
తన కొడుకు డాక్టర్ మైనంపల్లి రోహిత్‌కు మెదక్ టికెట్ ఇవ్వలేదనే కోపంతో హనుమంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అదే సమయంలో మంత్రి హరీశ్‌రావు మెదక్ నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తున్నారని, డిక్టేటర్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. హరీశ్గతం గుర్తుంచుకోవాలని,ట్రంక్‌పెట్టె, రబ్బరు చెప్పులతో వెలమ హాస్టల్‌కు వచ్చిన రోజులను తాను చూశానని విమర్శించారు. తనకన్నా చిన్న వాడైనా.. మినిస్టర్అయ్యేసరికి గొప్ప నేతగా ఫీల్అవుతున్నాడని ఎద్దేవా చేశారు.
ఇటీవల కొడుకు రోహిత్‌తో కలిసి హనుమంతరావు కాంగ్రెస్‌పార్టీలో చేరారు. మెదక్‌నుంచి ఎలాగైనా రోహిత్‌ను గెలిపించుకోవాలని హనుమంతరావు ప్రయత్నిస్తున్నారు. మండలాలు, వివిధ వర్గాల నాయకుల మద్దతు కూడగడుతున్నారు. స్వయంగా ఫోన్లు చేసి కాంగ్రెస్లీడర్లను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్లోని అసంతృప్తులను కాంగ్రెస్‌లోకి లాగుతున్నారు. హవేలీఘనపూర్మండలం నాగాపూర్ మాజీ సర్పంచ్అక్బర్మీద పోలీసులు రౌడీషీట్తెరిచిన విషయం తెలిసి హనుమంతరావు నేరుగా స్టేషన్‌కు వెళ్లారు. కేసులు, బైండోవర్ల పేరుతో కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకోబోమని పోలీసులతో చెప్పారు.
కాంగ్రెస్‌ను వీక్ చేయడమే టార్గెట్
ఎమ్మెల్యే పద్మ గెలుపు నల్లేరు మీద నడకే అని బీఆర్ఎస్లీడర్లు చెబుతున్నా.. మైనంపల్లి రోహిత్ నుంచి గట్టి పోటీ ఎదురవనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతోనే మంత్రి హరీశ్ మెదక్ పై స్పెషల్ఫోకస్పెట్టారని చెబుతున్నారు. ఇటీవల హనుమంతరావు చేసిన వ్యాఖ్యలకు రోహిత్‌ను ఓడించి సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారంటున్నారు.
ఈ క్రమంలోనే నియోజవర్గంలో కాంగ్రెస్‌ను బలహీన పరిచే పనిలో హరీశ్ ఉన్నారని చెబుతున్నారు. మెదక్కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఇటీవల డీసీసీ ప్రెడెంట్ పదవికి రాజీనామా చేయగా, ఆ వెంటనే తిరుపతిరెడ్డి ఇంటికి వెళ్లిన మంత్రి హరీశ్బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. గత శుక్రవారం కేటీఆర్ సమక్షంలో తిరుపతి రెడ్డి బీఆర్ఎస్లో చేరారు.
ఆయనతోపాటు మెదక్‌జిల్లా యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, చిన్నశంకరంపేట మండల అధ్యక్షుడు పోతరాజు రమణ గులాబీ కండువా కప్పుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలకు మంత్రి హరీశ్, ఎమ్మెల్యే పద్మ స్వయంగా ఫోన్‌చేసి మాట్లాడుతున్నట్లు, పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
హరీశ్‌పై కౌంటర్ అటాక్
ఈ నెల 2వ తేదీన రామాయంపేటలో జరిగిన బహిరంగ సభలో మంత్రి హరీశ్ మైనంపల్లిని ఉద్దేశించి విమర్శలు చేశారు. ‘హైదరాబాద్‌నుంచి పెద్ద పెద్ద కార్లలో కొందరు డబ్బు సంచులతో మెదక్ కు బయలుదేరారు. కరోనా టైంలో లేని లీడర్లు ఇప్పుడొచ్చి సేవ చేస్తామంటున్నారు. ఎలక్షన్లు అయ్యాక కనిపించకుండా పోతారు. అలాంటి వారిని నమ్మొద్దు’ అంటూ పరోక్షంగా హనుమంతరావును విమర్శించారు. 5న మెదక్ సభలో ‘గొర్రెల మందపై తోడేళ్ల పడ్డట్టు.. మహిళా ఎమ్మెల్యే మీద పోటీకి వస్తూ, నోట్ల కట్టలతో గెలవాలని చూస్తున్నారు’ అని మంత్రి హరీశ్మరోసారి ధ్వజమెత్తారు.
అదే స్థాయిలో మైనంపల్లి కౌంటర్ఇచ్చారు. మెదక్ లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్రాజకీయాలను డబ్బు మయం చేసి, ఇతర పార్టీలపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా విచ్చలవిడిగా డబ్బు, మందు పంచడం అలవాటు చేసిందన్నారు. సేవా భావంతో రాజకీయాల్లోకి వచ్చేవారికి అవకాశం లేకుండా చేస్తోందని మండిపడ్డారు. కరోనా టైంలో ఎంఎస్ఎస్ఓ ద్వారా తన కొడుకు రోహిత్ ఎన్నో సేవా కార్యక్రమాలను చేశాడని హరీశ్ వ్యాఖ్యలకు బదులు ఇచ్చారు.