
హైదరాబాద్, వెలుగు: రేవంత్ రెడ్డికి మెదక్‌లో తప్పుడు స్క్రిప్ట్ రాసిచ్చారని, ఆయన మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలేనని మెదక్ బీజేపీ లోక్సభ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. మోదీ పదేండ్ల అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని, రేవంత్ సిద్దమా? అని ఆయన ప్రశ్నించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక్రిశాట్, బీహెచ్ఎల్, బీడీఎల్, ఐడీపీఎల్ సంస్థలు ఇందిరా గాంధీ హయాంలో వచ్చాయని రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పారని ఆయన పేర్కొన్నారు.
ఇక్రిశాట్ 1972లో ఏర్పాటయిందని, బీహెచ్ఎల్ 1964 నెహ్రూ కాలంలో వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి వల్లనో, సోనియా గాంధీ వల్లనో మెదక్ కు పేరు రాలేదన్నారు. 'కొడంగల్‌లో ఓడిన రేవంత్ రెడ్డి.. మల్కాజి గిరిలో గెలవలేదా? దుబ్బాకలో ఓడితే మెదక్ లో పోటీ చేయకూడదా?' అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును పేదలకు పంచుతామని రేవంత్ రెడ్డి అన్నారని, ఇప్పటి వరకు ఎంతమందికి పంచారో చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. హరీశ్ రావు, రేవంత్ రెడ్డి నోటికేదోస్తే అది మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రైతు రుణ మాఫీ చేయకపోతే రాజ్ భవన్‌కు వచ్చి రేవంత్ రాజీనామా చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.