హైదరాబాద్​లో రోహింగ్యాల చొరబాట్లు: ఎంపీ రఘునందన్ రావు

హైదరాబాద్​లో రోహింగ్యాల చొరబాట్లు: ఎంపీ రఘునందన్ రావు

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్‌‌లో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాల వల్ల శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అక్రమ చొరబాటుదార్ల వల్ల భాగ్యనగరం, అభాగ్యనగరంగా మారుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం లోక్‌‌సభలో ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్ బిల్లు– 2025పై చర్చలో ఆయన మాట్లాడారు. అక్రమ చొరబాటుదారులు హైదరాబాద్‌‌లోనే కాకుండా.. తన మెదక్ నియోజకవర్గంలోని చిన్న పట్టణమైన సదాశివపేటలో కూడా ఉన్నారని తెలిపారు. 

ఈ ఏడాది జనవరిలో 20 మంది బంగ్లా దేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇది కేవలం తెలంగాణతోనే ఆగిపోలేదని, దక్షిణాది రాష్ట్రాల్లో అక్రమ బంగ్లా, రోహింగ్యాలా చొరబాట్లు పెరిగాయన్నారు. రోహింగ్యాల చొరబాట్లకు గత కాంగ్రెస్ సర్కారే కారణమని ఆరోపించారు. బలమైన చట్టాలను రూపొందించడంలో విఫలమై.. దేశ భద్రతను గాలికొదిలేసిందని ఆరోపించారు. కానీ, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో బలమైన ఫారిన్ పాలిసీ పార్లమెంట్‌‌లో పాస్ చేయబోతున్నట్లు వ్యాఖ్యానించారు. అందుకే సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను మోదీ సర్కార్ తేనుందని చెప్పారు.