మెదక్​ బీఆర్ఎస్​లో .. భగ్గుమన్న అసమ్మతి

మెదక్​ బీఆర్ఎస్​లో .. భగ్గుమన్న అసమ్మతి

మెదక్/పాపన్నపేట, వెలుగు : మెదక్  బీఆర్ఎస్​లో అసమ్మతి భగ్గుమంటోంది. మొన్నటి వరకు మౌనంగా ఉన్న అసమ్మతి నేతలు మళ్లీ పార్టీ టికెట్​ సిట్టింగ్​ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డికే కేటాయించడంతో భగ్గుమంటున్నారు. ఏడుపాయల ఆలయానికి  సంబంధించిన రూ. కోట్ల  విలువైన బంగారం, వెండి ఈఓ ఇంటికి తీసుకెళ్లిన వ్యవహారంలో ఎమ్మెల్యే భర్త దేవేందర్ రెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. 

దీంతో అమ్మవారి నగల ఇష్యూ చుట్టూ రాజకీయం నడుస్తోంది. రెండు కిలోల బంగారం, 72 కిలోల వెండిని ఆలయ ఈఓ శ్రీనివాస్​ నిబంధనలకు విరుద్ధంగా తన ఇంటికి తీసుకెళ్లాడని, ఈ సందర్భంగా ఆయన ‘దేవన్న’ అనే పేరు ప్రస్తావించడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులతో పాటు కొందరు బీఆర్​ఎస్​ లీడర్లు కూడా ఇఫ్కో డైరెక్టర్, ఎమ్మెల్యే భర్త దేవేందర్​ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. ఆలయ నిధులతో పాటు కోనాపూర్​సొసైటీలో రూ.2.26 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని,   కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు తీసుకున్నారని, భూకబ్జాలకు పాల్పడ్డారని అసమ్మతి నేతలు చెప్తుండగా.. అమ్మవారి బంగారం, వెండి తరలింపులో తనకు ఏ సంబంధం లేదని,  అవినీతికి పాల్పడలేదని దేవేందర్​రెడ్డి అంటున్నారు. పరస్పరం సవాళ్లు చేసుకుంటున్న  రెండు వర్గాలు గురువారం ఏడుపాయల దుర్గమ్మ గుడిలో  పోటాపోటీగా తడిబట్టలతో ప్రమాణాలు చేశారు. 

అవినీతికి పాల్పడలేదు : దేవేందర్​రెడ్డి 

తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని దేవేందర్​రెడ్డి అన్నారు. ఏడుపాయలలో గానీ,  నియోజకవర్గంలో మరెక్కడా గానీ అవినీతికి పాల్పడలేదని తెలిపారు. గురువారం తన అనుచరులతో కలిసి ఏడుపాయలకు వచ్చిన ఆయన.. మంజీరా నదిలో స్నానం చేసి తడిబట్టలతో  ప్రమాణం చేసి.. వనదుర్గా మాతకు పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన నిజాయితీని నిరూపించుకునేందుకే తడిబట్టలతో అమ్మవారి సమక్షంలో వాస్తవాలు చెప్తున్నానన్నారు. కోనాపూర్​ సొసైటీ  పదవి నుంచి   తొలగించడంతో తాను హైకోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. ఈవోల బదిలీ, పోస్టింగ్​ విషయంలో జోక్యం చేసుకోలేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.    

ఆధారాలున్నాయి : అసమ్మతి నేతలు 

బీఆర్ ఎస్​అసమ్మతి నేతలు గురువారం తమ మద్దతుదారులతో ఏడుపాయలకు ర్యాలీగా వచ్చారు. మంజీరా నదిలో స్నానాలు చేసి పసుపు బట్టలతో రాజగోపురంలో వనదుర్గామాత ముందు ప్రమాణం చేశారు. ప్రమాణం చేసిన వారిలో రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగ నరేందర్, చిన్నశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, అడ్వకేట్​ జీవన్ రావ్ తదితరులున్నారు.  

దేవేందర్​రెడ్డిపై తాము అనేక  ఆరోపణలు చేస్తే ఆయన కేవలం ఏడుపాయల బంగారం, వెండి  గురించి మాత్రమే మాట్లాడారని వారు మీడియాకు వివరించారు. ఏడుపాయలకు నిధులు వచ్చినప్పుడల్లా అక్కడే తిష్టవేసుకుని అన్నీ తానే అన్నట్టు  వ్యవహరించారని, కోనాపూర్​సొసైటీ అక్రమాలు, చిన్నశంకరంపేట తదితర ప్రాంతాలలో భూకబ్జాలు చేసినట్టు పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. ఉద్యమంలో పనిచేసిన వారిపై కేసులు పెట్టించి వేధిస్తున్నారన్నారు. దేవేందర్​రెడ్డిని రాజకీయంగా సమాధి చేస్తామని, వచ్చే ఎన్నికల్లో తమలో  ఒకరు రెబెల్​గా పోటీ చేస్తామన్నారు.