తాను నమ్మిన దేవుడిపై ఓ భక్తుడి అచంచలమైన విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ప్రార్థనా మందిరం. ఆకలి దప్పులతో అల్లాడుతున్న నిరుపేదలకు పని కల్పించి వాళ్ల కడుపు నింపిన కరుణామయుడి దేవాలయం.ఆసియా ఖండంలో రెండో అతి పెద్ద చర్చిగా పేరొంది, పరమత సహనానికి ప్రతీకగా నిలుస్తోంది.
దేశ విదేశీ టూరిస్టులను ఆకర్షిస్తున్న మెదక్‌లోని ఈ కేథడ్రల్ చర్చి నిర్మించి ఈ ఏడాదితో వందేళ్లు పూర్తయ్యింది. క్రిస్మస్ను పురస్కరించుకుని డిసెంబర్ 25న శతవసంతాల వేడుక జరగనుంది.
క్రైస్తవ మత ప్రచారకుడిగా ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన రెవరెండ్ చార్లెస్ వాకర్ ఫాస్నెట్1897లో మెదక్ పట్టణంలోని చాపెల్ చర్చి బిషప్ గా నియమితులయ్యారు. ఫాస్నెట్ అత్త మామలు ఆయన ఉండేందుకు మెదక్ మిషన్ కాంపౌండ్‌లో రెండంతస్థుల బిల్డింగ్ ఇచ్చారు. ఒక రోజు సాయంత్రం బిల్డింగ్ పైన పచార్లు చేస్తున్న సమయంలో చర్చి చిన్నగా ఉండి, తాను ఉండే బంగ్లా అంతకన్నా పెద్దగా ఉండడం గమనించారు ఫాస్నెట్.
అలా ఉండడం అపచారంగా భావించిన ఆయన పెద్ద చర్చి నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఇంగ్లాండ్ కు చెందిన తన ఫ్రెండ్ ఇంజనీర్ బ్రాడ్ షాతో 200 మోడల్స్ గీయించి అందులో ప్రస్తుత చర్చి నమూనాను సెలెక్ట్ చేశాడు.1914లో ప్రారంభమైన చర్చి నిర్మాణం పదేళ్ల పాటు కొనసాగి 1924లో పూర్తయ్యింది. అదే ఏడాది క్రిస్మస్ పర్వదినం రోజున మెదక్ చర్చి ప్రారంభోత్సవం జరిగింది. ఈ డిసెంబర్ 25వ తేదీకి సరిగ్గా100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శతాబ్ది వేడుకలు నిర్వహించేందుకు క్రైస్తవ మిషనరీ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
ఎన్నెన్నో విశేషాలు...
యూరప్ దేశపు గోతిక్ శైలిలో రూపుదిద్దుకున్న మెదక్ చర్చి మెయిన్ టవర్ ఎత్తు 173 అడుగులు, పొడవు 200 అడుగులు, వెడల్పు100 అడుగులు ఉంది. టెక్నాలజీ, భారీ యంత్రాలు అందుబాటులో లేని ఆ రోజుల్లోనే ఊహకందని రీతిలో అత్యద్భుతంగా ఈ చర్చిని నిర్మించారు. పూర్తిగా రాళ్లు, డంగు సున్నంతోనే నిర్మాణం పూర్తి చేశారు. విడి భాగాలన్నిటినీ ముందుగానే తయారు చేసుకుని తరువాత వాటిని క్రమంగా కలపడం- అనే నూతన ప్రక్రియకు ఆనాడే పునాది వేశారు. మన దేశంలో ఈ తరహా నిర్మాణం ఇదే మొదటిదని చెప్తారు.
అప్పట్లో దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రముఖ మేస్త్రీలు, శిల్పులు, కళాకారులు, వడ్రంగులతోపాటు ఇటలీ దేశ నిర్మాణ నిపుణులు సైతం మెదక్ చర్చి నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్నారు. చర్చి లోపల భక్తులు ప్రార్థన చేసేందుకు కట్టిన విశాలమైన హాల్లో ఫ్లోరింగ్ కోసం తెలుపు, ఎరుపు, నలుపు రంగుల ఇటాలియన్ టైల్స్ ఉపయోగించడం విశేషం. జెకోస్లవేకియా దేశ పనివారు దేవదారు కలపతో ఈగల్ రూపంలో తయారు చేసిన బైబిల్ పఠన వేదిక, రంగూన్ టేకుతో రూపొందించిన ప్రభు భోజనపు బల్ల, రోజ్ వుడ్‌తో తయారు చేసిన టేబుళ్లు, కుర్చీలు, దర్వాజాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. థామస్ ఎడ్వర్డ్ చర్చికి వాస్తు నిపుణులుగా పనిచేశారు.
ప్యాలెస్‌ను తలపించే గోల్ బంగ్లా
చర్చి వెనక భాగంలో ఉన్న వెస్లీ గోల్ బంగ్లా ప్యాలెస్‌ను తలపిస్తుంది. చర్చి నిర్మాణం పూర్తయిన రెండేళ్లకు1926లో క్రైస్తవ మత ప్రచారకులకు శిక్షణ ఇచ్చేందుకు దీనిని కట్టారు. ఇంగ్లాండ్‌లోని ట్రినిటీ ప్యాలెస్ తరహాలో ఉండే ఈ బంగ్లా టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతుంటాయి.
అద్దాల కిటికీల అద్భుతం!
మెయిన్ ఎంట్రెన్స్‌కు ఎదురుగా, కుడి, ఎడమ వైపుల ఉండే అద్దాల కిటికీలు ఈ చర్చిలో స్పెషల్ ఎట్రాక్షన్. తూర్పు దిక్కున ఉన్న కిటికీ అద్దం మీద ఏసు క్రీస్తు పుట్టుక, పడమర వైపు ఏసు శిలువ, ఉత్తర దిశలో క్రీస్తు సజీవుడై లేచిన దృశ్యాలు కనిపిస్తాయి. చిన్న చిన్న రంగుల అద్దాలతో ఈ మూడు కిటికీల్లో ఏసుక్రీస్తు జన్మవృత్తంతాన్ని పొందుపర్చారు ఇంగ్లాండ్‌కు చెందిన కళాకారుడు సాలిస్ బరీ. వెలుపలి వైపు నుంచి సూర్యకాంతి పడ్డప్పుడు మాత్రమే లోపలివాళ్లకి కిటికీల్లో నిక్షిప్తమైన దృశ్యాలు కనిపించడం వాటి ప్రత్యేకత.
వైభవంగా ఉత్సవాలు
చర్చి నిర్మించి వందేళ్లు పూర్తవుతుండడంతో శతాబ్ది వేడుకలను వైభవంగా చేసేందుకు సీఎస్ఐ ఏర్పాట్లు చేసింది. క్రిస్మస్ రోజు జరిగే ఉత్సవాలకు లండన్ నుంచి చర్చ్ నిర్మాత చార్లెస్ వాకర్ ఫాస్నెట్ మునిమనుమలు, మనుమరాండ్లు రానున్నారు. ఉత్సవాల కోసం చర్చి టవర్‌కు, ప్రాకారాలకు, ప్రార్థన మందిరంలో రంగులు వేశారు. శతాబ్ది వేడుకల సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జష్ణు దేవ్ వర్మ చర్చికి వస్తున్నారు. 23న కృతజ్ఞత ఆరాధన పండగ నిర్వహించనున్నారు. దీనికి వివిధ రాష్ట్రాల నుంచి సీఎస్ఐ పరిధిలోని 15 మంది పీఠాధిపతులు మెదక్‌కి వస్తున్నారు. రాత్రి చర్చి ప్రాంగణంలో భారీ సెట్టింగ్‌లతో క్రీస్తు జీవిత చరిత్ర తెలిపే కాంటాట ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక క్రిస్మస్ రోజు తెల్లవారు జామున 4:30 గంటలకు తొలి ఆరాధనతో చర్చ్‌లో సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంచార్జి బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ భక్తులకు దైవ సందేశం ఇస్తారు. క్రిస్మస్ రోజు రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కూడా వేడుకల్లో పాల్గొననున్నారు. అంతేకాదు.. వందేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చర్చి అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.29.18 కోట్లు మంజూరు చేసింది.
13 జిల్లాల పరిధి
గతంలో మెదక్ చర్చి ప్రార్థనాలయంగా మాత్రమే ఉండేది. 1947లో చర్చి ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ) ఆవిర్భవించి బిషప్ నియామకం అయ్యారు. దాంతో కేథడ్రల్ చర్చిగా మారింది. మెదక్ డయాసిస్ పరిధిలో ప్రస్తుతం13 జిల్లాలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు ఇందులో ఉండగా ఈ జిల్లాల్లో సీఎస్ఐ ఆధ్వర్యంలో విద్యా, వైద్య, సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
- తిమ్మన్నగారి శ్రీధర్, మెదక్, వెలుగు-