- బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 'మనఊరు మనబడి' కింద గవర్నమెంట్ స్కూళ్లలో పనులు
- నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడికక్కడ ఆగిపోయిన పనులు
- మెదక్ జిల్లాలో రూ.10.65 కోట్ల బిల్లుల పెండింగ్
- పెండింగ్ బిల్లులు కోసం ఎస్ఎంసీ చైర్మన్ల ఆందోళన
మెదక్, మెదక్ టౌన్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం మనఊరు మనబడి పథకం కింద గవర్నమెంట్ స్కూళ్లలో పనులు చేయించినప్పటికీ అవసరమైన నిధులు విడుదల చేయని కారణంగా కాంట్రాక్టర్లు నానా తిప్పలు పడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ పెండింగ్బిల్లులు చెల్లించాలని జిల్లాలోని వివిధ స్కూళ్ల ఎస్ఎంసీ చైర్మన్లు మంగళవారం మెదక్ పట్టణంలోని గవర్నమెంట్ గర్ల్స్హైస్కూల్ గేట్ కు తాళం వేసి ధర్నా చేశారు. 2022లో గవర్నమెంట్స్కూళ్లలో కనీస వసతులు లేక స్టూడెంట్స్, టీచర్లు ఇబ్బందులు పడుతుండడంతో అప్పటి బీఆర్ఎస్ప్రభుత్వం 'మన ఊరు- మన బడి' పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకం కింద గవర్నమెంట్ స్కూళ్లలో బిల్డింగ్రిపేర్స్, కాంపౌండ్స్, డైనింగ్ హాల్స్, కిచెన్షెడ్లు, వాటర్ ట్యాంకులు, నల్లాలు, ఎలక్ట్రిసిటీ పనులు మొదలుపెట్టింది. మెదక్జిల్లాలో ఈ పథకం కింద180 ప్రైమరీ, 44 అప్పర్ప్రైమరీ, 89 హైస్కూళ్లు కలిపి మొత్తం 313 స్కూళ్లనుసెలెక్ట్ చేశారు. ఆయా స్కూళ్లలో రూ.65.12 కోట్ల విలువైన పనులు చేపట్టారు. జరిగిన పనులకు ఇప్పటి వరకు రూ.19.80 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.10.65 కోట్ల బిల్లులు పెండింగ్ఉన్నాయి.
అసంపూర్తిగా పనులు
మన ఊరు మన బడి పథకం కింద చేపట్టిన పనులు 2023–24 అకాడమిక్ ఇయర్ప్రారంభంలోపు పూర్తి కావాల్సి ఉండగా ప్రభుత్వం అవసరమైన నిధులు విడుదల చేయలేదు. ఫలితంగా చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేయడం ఆపేశారు. దీంతో అనేక స్కూళ్లలో ఈ పథకం కింద చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలి పోయాయి.
Also Read :- ఇందిరమ్మ యాప్ లాంచ్ .. ప్రారంభించనున్న సీఎం రేవంత్
మరికొంతమంది కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేసినా బిల్లులు రాక లబోదిబోమంటున్నారు. బంగారం కుదువ పెట్టి, అప్పులు తెచ్చి లక్షలు ఖర్చుచేసి పనులు చేయగా ఏడాదిన్నర దాటిపోయినా బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమ వుతున్నామని పనులు చేసిన ఎస్ఎంసీ చైర్మన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసిన అప్పులకు మిత్తీలు పెరిగిపోతుండడంతో పాటు, అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరుగుతోందంటున్నారు. కొందరు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం స్పందించి చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
రూ.12 లక్షలు రావాలి
మన ఊరు -మన బడి పథకం కింద గర్ల్స్ హైస్కూల్లో అడిషనల్క్లాస్రూమ్ల నిర్మాణం చేపట్టా. రూ.12 లక్షల వరకు ఖర్చు పెట్టాను. ఇప్పటికీ చేసిన పనికి బిల్లు రాలేదు. ఇంజనీరింగ్ ఆఫీసర్లు, ఎడ్యుకేషన్ఆఫీస్ల చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా బిల్లు మంజూరు కావడంలేదు. - దశరథం, ఎస్ఎంసీ చైర్మన్, మెదక్
చాలా ఇబ్బందిగా ఉంది
నేను స్థానిక స్కూల్లో మన ఊరు మన బడి పథకం కింద పనులు చేసి దాదాపు ఏడాదిన్నర అయింది. నేను చేసిన పనులకు సంబంధించి రూ.13 లక్షలు రావాలి. అప్పు తెచ్చి పనులు చేస్తే ఇప్పటివరకు బిల్లు రావడం లేదు. ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు మంజూరు చేసి పెండింగ్ బిల్లులు చెల్లించాలి. -పి.కృష్ణ, కొల్చారం