
- సివిల్ సప్లై గోదాముల్లో గోల్ మాల్.. 6వేల267 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం మాయం
- రూ.5.41 కోట్ల విలువైన సరుకు పక్కదారి
- అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమాలకు పాల్పడుతున్న గోడౌన్ ఇన్ చార్జీలు
- 3.61 లక్షల కొత్త గన్నీ బ్యాగులు సైతం గాయబ్
మెదక్/రామాయంపేట, వెలుగు : మెదక్ జిల్లాలోని సివిల్ సప్లై గోదాముల్లో గోల్మాల్ జరిగింది. మండల్ లెవెల్ స్టాకిస్ట్ (ఎంఎల్ఎస్) పాయింట్ల నుంచి కోట్ల రూపాయల విలువైన వేల క్వింటాళ్ల సన్నబియ్యం మాయమైంది. అంతేకాకుండా లక్షల సంఖ్యలో కొత్త గన్నీ బ్యాగులు కూడా గాయబ్ అయ్యాయి. జిల్లావ్యాప్తంగా మెదక్, రామాయంపేట, చేగుంట, తూప్రాన్, నర్సాపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేటలో ఒక్కోటి చొప్పున ఏడు ఎంఎల్ఎస్ పాయింట్లు ఉన్నాయి.
రైస్ మిల్లర్ల నుంచి కస్టం మిల్లింగ్ కింద సేకరించే బియ్యం.. సెంట్రల్ వేర్ హాస్ కార్పొరేషన్(సీడబ్ల్యూసీ), స్టేట్ వేర్ హౌజ్ కార్పొరేషన్ (ఎస్ డబ్ల్యూసీ) గోడౌన్లకు చేరుతుంది. అక్కడి నుంచి ప్రజా పంపిణీ విధానం (పీడీఎస్) కింద రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు అవసరమైన బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలిస్తారు. ప్రతి నెలా 30 వేల క్వింటాళ్ల బియ్యాన్ని ఆయా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి జిల్లాలోని 21 మండలాల పరిధిలో ఉన్న 521 రేషన్ షాపులకు, అలాగే 2 వేల క్వింటాళ్ల బియ్యాన్ని ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్లకు 2 సరఫరా చేస్తారు.
అయితే, ఎంఎల్ఎస్ పాయింట్లపై పర్యవేక్షణ కరువైంది. సివిల్ సప్లై అధికారులు ప్రతి నెలా ఎంఎల్ఎస్ పాయింట్లను తనిఖీ చేయాలి. ఎఫ్‌సీఐ నుంచి ఎన్ని క్వింటాళ్ల పీడీఎస్ రైస్ గోడౌన్‌కు వచ్చింది, అక్కడి నుంచి రేషన్ షాపులకు ఎంత సరఫరా అయ్యింది, ఇంకా ఎంత మేర బియ్యం నిల్వ ఉంది అన్న విషయాలను సివిల్ సప్లై అధికారులు పరిశీలించాలి. అయితే రెగ్యులర్‌గా ఈ తనిఖీలు జరగంలేదు. దీంతో ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్ చార్జీలు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. పర్యవేక్షణ లోపాన్ని ఆసరాగా తీసుకుని ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్ చార్జీలు అక్రమాలకు పాల్పడుతున్నారు. వేల క్వింటాళ్ల పీడీఎస్ రైస్‌ను పక్కదారి పట్టిస్తున్నారు.
అక్రమాలు ఇలా...
సివిల్ సప్లై విజిలెన్స్ వింగ్ ఆఫీసర్లు ఇటీవల జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని ఎంఎల్ఎస్ పాయింట్లో రికార్డుల్లో ఉన్న లెక్కలకు, నిల్వ ఉన్న స్టాక్ కు భారీ తేడా ఉన్నట్లు గుర్తించారు. 3,627 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, 22 క్వింటాళ్ల సన్న బియ్యం పక్కదారి పట్టినట్లు తేలింది. అలాగే ఇక్కడి నుంచి 3.61 లక్షల కొత్త గన్నీ బ్యాగ్‌లు కూడా మాయమయ్యాయి.
మాయమైన బియ్యం, గన్నీ బ్యాగుల విలువ రూ.4.50 కోట్ల విలువ ఉంటుంది. అలాగే రామాయంపేట ఎంఎల్ఎస్ పాయింట్లో రికార్డుల్లో ఉన్నదాని కన్నా 1,468 క్వింటాళ్ల పీడీఎస్ రైస్, 14 క్వింటాళ్ల సన్న బియ్యం మధ్య తేడా ఉన్నట్లు విచారణలో తేలింది. ఇక్కడి నుంచి మాయమైన బియ్యం విలువ రూ.56 లక్షలు. చేగుంటలోని ఎంఎల్ఎస్ పాయింట్లో రికార్డుల్లో ఉన్నదాని కన్నా 933 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ తక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. ఇక్కడ పక్కదారి పట్టిన బియ్యం విలువ రూ.35 లక్షలు.
గోడౌన్ ఇన్ చార్జీలను ..సస్పెండ్ చేశాం
సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్లన్నింటిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాం. మెదక్, రామాయంపేట, చేగుంట ఎంఎల్ఎస్ పాయింట్లలో పెద్ద మొత్తంలో పీడీఎస్ రైస్, సన్నబియ్యం, గన్నీ బ్యాగ్‌లు పక్కదారి పట్టినట్టు గుర్తించాం. మెదక్, రామాయంపేట గోడౌన్ ఇన్ చార్జీలను సస్పెండ్ చేశాం. చేగుంట గోడౌన్ ఇన్ చార్జిపైనా చర్యలు తీసుకుంటాం. ఆయా చోట్ల బియ్యం పక్కదారి పట్టడంపై కమిషనర్‌కు నివేదిక పంపించాం. అక్కడి నుంచి ఆదేశాలు వచ్చాక మాయమైన బియ్యం డబ్బులను బాధ్యుల నుంచి రికవరీ చేసేందుకు ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగిస్తాం.
- హరికృష్ణ, సివిల్ సప్లై డీఎం