
మెదక్ (చేగుంట), వెలుగు: తమ భూ సమస్యను రెవెన్యూ ఆఫీసర్లు పరిష్కరించడం లేదని మనస్తాపంతో మెదక్ జిల్లా చేగుంటలో ఓ రైతు కుటుంబంతో సహ సోమవారం తహసీల్దార్ ఆఫీస్లో ఆత్మహత్యా యత్నం చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... చేగుంటకు చెందిన సండ్రగు రవికి సర్వే నెంబర్ 51, 53, 14లో ఏడెకరాల అసైన్మెంట్ భూమి ఉంది. ఆ భూమిని వేరే వాళ్లు కబ్జా చేశారని రవి ఆరోపిస్తున్నాడు. సర్వే చేసి తన భూమికి హద్దులు చూపించాలని చాలా రోజులుగా రెవెన్యూ ఆఫీసర్ల చుట్టు తిరుగుతున్నా పట్టించుకోకుండా సతాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలో ఓపిక నశించి రవి కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ ఆఫీస్కు వచ్చాడు. రెవెన్యూ ఆఫీసర్ల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేశారు. ఆ టైంలో అక్కడున్న రెవెన్యూ సిబ్బంది, ఇతర వ్యక్తులు ఇది గమనించి వెంటనే రవి చేతిలో నుంచి పెట్రోల్ డబ్బా లాక్కుని ఎవరికి ఎలాంటి అపాయం జరగకుండా చూశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్ బాధితులతో మాట్లాడారు. సంబంధిత పొలం వద్దకు వెళ్లి పరిశీలించి సర్వే నిర్వహించి త్వరలో న్యాయం జరిగే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.