వీఆర్ఏల రెగ్యులరైజేషన్​ జీవో రద్దు కోసం .. సెల్​టవర్​ ఎక్కి నిరసన

వీఆర్ఏల రెగ్యులరైజేషన్​ జీవో రద్దు కోసం .. సెల్​టవర్​ ఎక్కి నిరసన
  •  రాత్రి వరకు కొనసాగిన ఆందోళన 

 మెదక్ (చేగుంట), వెలుగు : వీఆర్ఏల రెగ్యులరైజేషన్​ జీవో రద్దు చేయాలని మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లికి చెందిన కొండి ప్రదీప్ గురువారం సెల్​టవర్​ఎక్కి నిరసన తెలిపాడు. వీఆర్ఏల రెగ్యులరైజేషన్​ఎవరికీ నచ్చడం లేదని, వాటా బందీ విధానాన్ని ఇదివరకటి లాగానే కొనసాగించాలని డిమాండ్​ చేశాడు. జీవో వల్ల ఎంతో మందికి నష్టం జరుగుతుందన్నాడు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో టవర్​ఎక్కిన ప్రదీప్​ రాత్రి ఏడున్నర గంటల వరకు పైనే ఉన్నాడు. 


పోలీస్, రెవెన్యూ, ఫైర్​ సిబ్బంది వచ్చి ఎంత నచ్చజెప్పినా టవర్ ​దిగేందుకు నిరాకరించాడు. తన డిమాండ్​ ముఖ్యమంత్రి కేసీఆర్​వరకు చేరాలన్నాడు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావ్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి, మెదక్ కలెక్టర్ ​రాజర్షిషా చేగుంటకు వచ్చి తన డిమాండ్లను విని సమస్య పరిష్కరించేంత వరకు టవర్​నుంచి కిందకు దిగనని స్పష్టం చేశాడు. చివరకు బతిమిలాడడంతో రాత్రి 8:45 గంటలకు టవర్​ దిగాడు.