ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలి : కలెక్టర్  రాహుల్ రాజ్ 

ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలి : కలెక్టర్  రాహుల్ రాజ్ 

కొల్చారం, వెలుగు:- ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని కలెక్టర్  రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం క్షేత్ర పర్యటనలో భాగంగా కొల్చారం మండలం రంగంపేటలో  ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఫ్యాక్స్, ఐకేపీ, మార్కెటింగ్ శాఖల ద్వారా 497 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 255 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మిగిలిన సెంటర్స్ మరికొద్ది రోజుల్లో రైతులకు అందుబాటులోకి వస్తాయని వివరించారు.  

రైతుకు మద్దతు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించాలన్నారు. సన్న, దొడ్డు రకానికి వేర్వేరుగా రికార్డులను నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా సన్న రకం ధాన్యంపై రూ. 500 బోనస్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ బోనస్‌48 గంటల్లో  రైతుల అకౌంట్లలోకి జమ అవుతాయన్నారు.  ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలని, నిర్దేశించిన విధంగా కొనుగోళ్లు చేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో  పెట్టుకొని తప్పనిసరిగా  టార్పాలిన్లు  అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. 

ప్రభుత్వ ఆఫీసుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

మెదక్​టౌన్: కలెక్టరేట్​తోపాటు జిల్లాలోని అన్ని ఆఫీసుల్లో 160 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కంట్రోల్​రూంకు అనుసంధానం చేసినట్లు కలెక్టర్​ రాహుల్​రాజ్ తెలిపారు.​ ఈ సందర్భంగా ఆయా ఆఫీసులను సందర్శించి సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది సమయపాలన, పనితీరును తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయన్నారు. మహిళా సమాఖ్య  ద్వారా ఏర్పాటు చేసిన క్యాంటీన్ పరిశీలిస్తూ కలెక్టర్ ఆఫీసుకు వస్తున్న ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలని, క్యాంటీన్ శుభ్రంగా ఉంచాలని సూచించారు. కలెక్టర్ వెంట ఈడీఎమ్​ సందీప్​, సీసీటీవీ కెమెరాల టెక్నీషియన్ ఖాసీమ్​, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.