ఏడుపాయల్లో మరో అవినీతి భాగోతం

ఏడుపాయల్లో మరో అవినీతి భాగోతం
  • దుకాణానికి రూ.4 లక్షల చొప్పున వసూలు
  •  రసీదులు ఇవ్వని అధికారులు
  •  లబోదిబోమంటున్న వ్యాపారులు

పాపన్నపేట, వెలుగు :  మెదక్​ జిల్లాలోని ఏడుపాయల ఆలయానికి సంబంధించిన రూ.3 కోట్ల విలువైన బంగారం, వెండి ఈవో ఇంటికి తీసుకెళ్లడం వివాదాస్పదం కాగా, తాజాగా రూ.3 కోట్లతో నిర్మించిన షాపుల కేటాయింపులోనూ అవకతవకలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది.  షాపింగ్​ కాంప్లెక్స్​లో తొమ్మిది దుకాణాలను నిర్మించగా 30, 40 ఏండ్ల నుంచి అదే జాగాలో టెంపరరీ దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకుంటున్న వారికే అద్దెకు ఇచ్చారు. అయితే, దుకాణాలు అలాట్​చేసేటపుడు ఒక్కొక్కరి దగ్గర డిపాజిట్ పేరుతో రూ.4 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం.

 9 దుకాణాలకు 8 మంది వద్ద రూ.4 లక్షల చొప్పున రూ.32 లక్షలు ఆలయ అధికారులు తీసుకున్నారని తెలుస్తోంది. అడ్వాన్స్​పేరుతో ఈ డబ్బంతా తీసుకున్నా ఎలాంటి రసీదులు ఇవ్వడం గాని, అగ్రిమెంట్​పేపర్లు రాసుకోవడం కానీ చెయ్యలేదు. మూడు రోజుల కింద ఏడుపాయల ఆలయ ఈవో బంగారం తీసుకెళ్లిన వ్యవహారం బయటకు రావడంతో సదరు వ్యాపారులు తాము ఇచ్చిన రూ. 4 లక్షలు ఏమవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. జాతర టైంలో డబ్బులు లేకపోతే భార్య మెడలో బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు డిపాజిట్ చేశామని చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించి తమ డిపాజిట్లకు రసీదులు ఇవ్వాలని కోరుతున్నారు.