మెదక్, వెలుగు : కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెల రోజులు అవుతున్నా వడ్లు తూకం వేయడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి చౌరస్తా వద్ద సోమవారం రాస్తారోకో నిర్వహించారు. వీరికి మద్దతుగా బీజేపీ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను కొంటామన్న ప్రభుత్వం, కొనుగోళ్లలో జాప్యం చేస్తోందని, దీంతో రైతులు రోజులు, వారాల తరబడి కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సన్న వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదని, దీన్ని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ లీడర్లే దళారులుగా మారి రైతుల నుంచి తక్కువ ధరకు వడ్లు కొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి సన్న వడ్లు కొనడంతో పాటు, రూ. 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులను కాపాడుతుందన్న నమ్మకంతో కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే.. తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని, సివిల్ సప్లై ఆఫీసర్లతో మాట్లాడి వడ్లు తూకం వేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.