
- ఉమ్మడి మెదక్ జిల్లా లక్ష్యం 10,41,774 టన్నులు
- మొత్తం 1,115 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: యాసంగి వరి కోతలు మొదలుకావడంతో వడ్ల కొనుగోలు షురూ అయ్యాయి. ఈ సీజన్లో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 6,92,986 ఎకరాల్లో వరి పంట సాగైంది. 17,59,840 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. ఇందులో రైతుల అవసరాలు, ప్రైవేట్ కొనుగోళ్లు పోను 10,41, 774 మెట్రిక్ టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు పీఏసీఎస్, ఐకేపీ, ఏఎంసీ, ఎఫ్‌పీవోల ఆధ్వర్యంలో 1,115 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో..
జిల్లాలో యాసంగి సీజన్లో 3.50 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగైంది. మొత్తం 8.95 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో రైతుల అవసరాలు, ఇతరత్రా కొనుగోళ్లు పోను 5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్దం చేశారు. ఇప్పటికే జిల్లాలో 50 పైకి పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఇందులో 4.70 లక్షల టన్నుల ధాన్యం దొడ్డు రకం మిగతా 30 వేల టన్నుల సన్న రకం ధాన్యం సేకరిస్తారు. జిల్లాలో 419 కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఇందులో ఐకేపీ 211, పీఏసీ ఎస్ 202, ఏఏంసీ 6 కొనుగోలు కేంద్రాలు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్యాడి క్లీనర్లు, వేయింగ్ స్కేల్, మాయిశ్చర్ మీటర్లు, డ్రైన్ డ్రైయేర్స్, టార్పాలిన్లు అందుబాటులో ఉంచారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులను సమకూర్చి, ధాన్యం తూకం వేసిన వెంటనే వోపీఎంఎస్ లో ఎంట్రీ చేసి రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఏరోజుకు ఆ రోజే తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో..
జిల్లాలో మొత్తం 96,850 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఇందులో 89,102 ఎకరాల్లో దొడ్డు రకం, 7,747 ఎకరాల్లో సన్నరకం సాగైంది. 2,97,456 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో 1,93,677 టన్నులు దొడ్డు రకం, 13,779 టన్నులు సన్న రకం. రైతుల అవసరాలు, ప్రైవేట్ అమ్మకాలు పోను 1,52,000 టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు మొత్తం 216 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఐకేపీ 106, పీఏసీఎస్ 91, డీసీఏంఎస్18, ఎఫ్ పీవో ఒక కేంద్రం ఉన్నాయి. జోగిపేటలో గురువారం మంత్రి దామోదర రాజనర్సింహ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
మెదక్ జిల్లాలో..
జిల్లాలో మొత్తం 2,46,136 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. ఇందులో 2,02,550 దొడ్డు రకం, 43,586 సన్న రకం. మొత్తం 5,67,384 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఇందులో రైతుల అవసరాలు, ప్రైవేట్ కొనుగోళ్లు పోను కొనుగోలు కేంద్రాలకు 3,89,774 టన్నుల ధాన్యం వస్తుందని అంచనా. ఇందులో 3,32,534 టన్నులు దొడ్డు రకం, 57,240 టన్నులు సన్న రకం. ఈ మేరకు మొత్తం 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పీఏసీఎస్ 324, ఐకేపీ 127, డీసీఏంఎస్ 10, ఎఫ్‌పీవో 19 ఉన్నాయి. ఎమ్మెల్యే రోహిత్, కలెక్టర్ రాహుల్ రాజ్ పలుచోట్ల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ టౌన్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మెదక్ మండలంలోని శివ్వాయిపల్లి ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులతో మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు.
అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ఎక్కువ సంఖ్యలో టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగేలా కృషి చేయాలని ఆదేశించారు. రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే తూకం వేయించి లారీలలో లోడ్ చేసి నిర్దేశిత రైస్ మిల్లులకు పంపించాలని, మిల్లుల వద్ద ధాన్యం అన్ లోడింగ్ వెంటనే జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు.