తెలంగాణలో మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీ షురూ

తెలంగాణలో మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీ షురూ
  • మెదక్ జిల్లాలో అందుబాటులోకి తెచ్చిన ఎన్​డీఎల్ఐ
  • ప్రారంభించిన కలెక్టర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్  సుహాసిని రెడ్డి
  • ప్రత్యేకంగా10 కంప్యూటర్​లు.. 12 భాషల్లో పుస్తకాలు
  • నిరుద్యోగ యువతకు మరింత మెరుగైన సేవలు

మెదక్, వెలుగు: తెలంగాణలో మొట్టమొదటి సారిగా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటైంది. రాష్ట్రంలో 33 జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ లైబ్రరీలు ఉండగా, తొలిసారిగా మెదక్​జిల్లాకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా (ఎన్​డీఎల్ఐ) డిజిటల్ లైబ్రరీని మంజూరు చేసింది. కోల్ కతాలోని రాజారామ్ మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ సౌజన్యంతో మెదక్​జిల్లా గ్రంథాలయంలో10 కంప్యూటర్ లు ఏర్పాటు చేశారు. తద్వారా ఎన్​డీఎల్ఐ వెబ్​సైట్, యాప్ ద్వారా 12 భాషల్లో అన్ని రకాల పుస్తకాలు చదువుకునే వీలు కల్పించారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ లైబ్రరీని కలెక్టర్​ రాహుల్​ రాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్​పర్సన్​చిలుముల సుహాసిని రెడ్డి కలిసి శుక్రవారం ప్రారంభించారు. నిరుద్యోగ యువత డిజిటల్​లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మెదక్​పట్టణంలో గతంలో బ్రాంచ్​లైబ్రరీ మాత్రమే ఉండేది. 

2016లో జిల్లాల పునర్​వ్యవస్థీకరణ అనంతరం మెదక్​కేంద్రంగా జిల్లా గ్రంథాలయం ఏర్పాటైంది. కానీ, భవనం లేక బ్రాండ్​లైబ్రరీలోనే అరకొర సౌలతుల మధ్య కొనసాగింది. ఆ తర్వాత రూ.50 లక్షలతో రెండు అంతస్తుల్లో అన్ని హంగులతో భవనం నిర్మించారు. ఇందులో విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే నిరుద్యోగులకు, సాధారణ పాఠకులకు వేర్వేరు విభాగాలు ఉన్నాయి. కొత్త బిల్డింగ్ లోకి జిల్లా గ్రంథాలయం మారిన తరువాత పాఠకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి రోజు 250 మంది పాఠకులు వస్తున్నారు.

మరిన్ని బుక్స్, జర్నల్స్ ​సమకూరుస్తాం

లైబ్రరీలను అన్ని సౌలతులతో తీర్చిదిద్దుతున్నాం. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు అవసరమైన మరిన్ని బుక్స్, జర్నల్స్ ను సమకూర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాకు చెందిన నిరుద్యోగులు లైబ్రరీ సేవలను వినియోగించుకుని పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటుతున్నారు. ఇప్పుడు డిజిటల్​లైబ్రరీ అందుబాటులోకి రావడంతో వారికి మరింత మెరుగైన సేవలు అందనున్నాయి. రానున్న రోజుల్లో లైబ్రరీని మరింత అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తాం. 

సుహాసిని రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్​