ప్రింటింగ్​ ప్రెస్‌లు చట్టం పరిధిలో పనిచేయాలి : రాజర్షి షా

ప్రింటింగ్​ ప్రెస్‌లు చట్టం పరిధిలో పనిచేయాలి : రాజర్షి షా
  • మెదక్​ కలెక్టర్​ రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు : జిల్లాలోని  ప్రింటింగ్ ప్రెస్ యజమానులు ప్రజా ప్రాతినిధ్య చట్టం పరిధిలో పని చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా అన్నారు. మంగళవారం ఎన్నికల నియమావళి, మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ లో భాగంగా జిల్లాలోని ప్రింటర్లు, ప్రింటింగ్​ ప్రెస్​ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ -127 (ఏ) ప్రకారం జిల్లాలో ఉన్న ప్రింటర్లందరూ పాంప్లేట్స్​, స్టిక్కర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు చేసే వారు ప్రతి ఒక్కరూ ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.  ప్రింట్ చేసిన తరువాత పబ్లిషర్ పేరు, ఎన్ని కాపీలు ప్రింట్ చేశారు తదితర వివరాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించారు.  

ఎన్నికల అధికారుల తనిఖీ సమయాల్లో ప్రింటింగ్​కు సంబంధించిన అనుమతి పత్రాలు కలిగి ఉండాలన్నారు. వేరే ప్రాంతాల్లో ప్రింటింగ్ చేసి తరలిస్తే చెక్ పోస్టుల  వద్ద పట్టుబడితే నిబంధనల ప్రకారం అభ్యర్థి ఎన్నికల ఖర్చు కింద జమకడతారని స్పష్టం చేశారు.  ఎన్నికల నియామావళి ప్రకారం జైలు శిక్ష తో పాటు ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లు, డీపీఆర్​వో  ఏడుకొండలు, జిల్లా ప్రింటింగ్ ప్రెస్ యజమానులు,  సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

పార్టీలు సహకరించాలి

 జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్​ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. కలెక్టరేట్​లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ.. ఎన్నికల ఫిర్యాదులు, అనుమతులు, నామినేషన్ ప్రక్రియలను సులభతరం చేసేలా సీ--విజిల్, ఈ- -సువిధ యాప్​లను అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. ప్రచారాలను ఎప్పటికప్పుడు కమిటీల ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు.  సమావేశంలో జిల్లా అడిషనల్​ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్​, జిల్లాలోని రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.