
శివ్వంపేట, వెలుగు : మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవాపేట పంచాయతీ పరిధిలోని రాములు తండాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి పచ్చి చికెన్ తినేందుకు ప్రయత్నించగా ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరాడక చనిపోయాడు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కొత్తగూడెం తండాకు చెందిన భీమ్లా నాయక్ (40) బతుకు దెరువు కోసమని నాలుగు నెలల క్రితం భార్య, నలుగురు పిల్లలతో కలిసి అత్తగారి ఊరైన రాములు తండాకు వచ్చాడు. కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నాడు.
హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బీమ్లా కూతుళ్లు దసరా సెలవులు ఇవ్వడంతో గురువారం ఇంటికి వచ్చారు. దీంతో వారికోసమని భీమ్లా భార్య రేణుక చికెన్ తెచ్చి ఇంట్లో గిన్నెలో పెట్టింది. బయట మద్యం తాగి ఇంటికి వచ్చిన బీమ్లా రాత్రి 7 గంటల సమయంలో కరెంటు పోగా మద్యం మత్తులో చికెన్ వండిందనుకుని పచ్చి ముక్కలు నోట్లో వేసుకున్నాడు.
అవి గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక విలవిల్లాడాడు. భార్య రేణుక గమనించి వెంటనే గొంతులో నుంచి రెండు చికెన్ ముక్కలు బయటకు తీసింది. కాగా మరో ముక్క గొంతులోనే ఉండడంతో వెంటనే నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిశీలించిన డాక్టర్ అప్పటికే బీమ్లా ఊపిరాడక చనిపోయాడని నిర్ధారించారు.