
- జిల్లాలో పెరుగుతున్న సాగు విస్తీర్ణం
మెదక్, వెలుగు: జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మార్కెట్లో ఆయిల్ పామ్ గెల ధర భారీగా పెరగడం, ప్రభుత్వం రాయితీ సొమ్ము జమ చేస్తుండడంతో రైతులు ఆయిల్ పామ్ తోటల సాగువైపు మొగ్గు చూపుతున్నారు. నర్సరీలు ఏర్పాటు చేసి నాణ్యమైన మొక్కలు ఉత్పత్తి చేసి సరఫరా చేస్తుండడంతో పాటు తోటల నిర్వహణ కోసం ఎకరాకు ఏడాదికి రూ.4,200 చొప్పున ప్రోత్సాహకం అందిస్తోంది. ఆయిల్ పామ్ తోటలు సాగు చేసిన రైతుల అకౌంట్లలోరూ.28 లక్షలు జమయ్యాయి. గతేడాది సాగు చేసిన 78 మంది రైతులకు రూ.13.95 లక్షలు ఈ ఏడాది సాగు చేసిన 106 మందికి రూ.16.26 లక్షల ప్రోత్సాహకం జమయ్యాయి.
859 ఎకరాలలో ఆయిల్పామ్సాగు
జిల్లాలో ఇప్పటి వరకు 859 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగైంది. 2023 –24లో 332.17 ఎకరాల్లో, 2024–-25లో 526.78 ఎకరాల్లో సాగు చేశారు. ఇదివరకు ఆయిల్ పామ్ గెల ధర టన్నుకు రూ.12,500 ఉండగా ఏకంగా రూ.8,500 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్ లో టన్ను ధర రూ.21 వేలు పలుకుతుండడంతో రైతులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల రైతులు ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో ఆయిల్ పామ్ తోటను సాగు చేయాలంటే రైతులు ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి ఖమ్మం జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు వెళ్లి ఆయిల్ పామ్ మొక్కలను తీసుకొచ్చి తోటను సాగు చేసేవారు.
దీంతో రైతులకు అయ్యే ఖర్చుతో పాటు రవాణా ఖర్చులు అదనపు భారం అయ్యేవి. కాగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోన్న ప్రస్తుత రాష్ట ప్రభుత్వం రైతులకు అవసరమైన మొక్కలను అందించేందుకు జిల్లాలోనే నర్సరీలను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది. స్థానికంగా నర్సరీ ఉండడం వల్ల దూర ప్రాంతాలకు వెళ్లి మొక్కలు తెచ్చుకొనే ఇబ్బంది లేకుండా, సబ్సిడీపై నాణ్యమైన మొక్కలు అందిస్తోంది.
43 ఎకరాల విస్తీర్ణంలో నర్సరీ ఏర్పాటు
జిల్లాలో నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో 43 ఎకరాల విస్తీర్ణంలో నర్సరీ ఏర్పాటు చేశారు. సాంకేతిక పద్దతుల్లో ఇక్కడ మొక్కలను ఉత్పత్తి చేస్తూ రైతులకు నాణ్యమైన మొక్కలను అందజేస్తున్నారు. ఒక ఎకరా విస్తీర్ణంలో ఆయిల్ పామ్ తోట సాగు చేయడానికి 50 నుంచి 54 మొక్కలు అవసరమవుతాయి. వాస్తవంగా ఒక మొక్క ఖరీదు రూ.193 కాగా రైతులకు కేవలం రూ. 20 రూపాయలకే అందిస్తున్నారు. ప్రభుత్వం రూ.173 రూపాయలను సబ్సిడీగా అందిస్తోంది.