- జీడిపల్లి గ్రామంలో ఇద్దరు నిందితుల నుంచి 10. 300 కిలోల గంజాయి స్వాధీనం
- వివరాలు వెల్లడించిన ఎస్పీ ఉదయ్ కుమార్
తూప్రాన్, వెలుగు: మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామ శివారులోని నేషనల్ హైవే 44 రోడ్డు అండర్ బ్రిడ్జి వద్ద గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని బుధవారం రిమాండ్ కు తరలించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ తెలిపారు. తూప్రాన్ లో డీఎస్పీ వెంకటరెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జీడిపల్లి గ్రామ శివారులో రంజన్ కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ వెంబడించి పట్టకున్నాడు.
దీంతో అతడి వద్ద ఉన్న బ్యాగులో కిలో గంజాయి దొరికిందన్నారు. రంజన్ కుమార్‌ను విచారించగా.. తన స్నేహితుడు శ్రీధర్ సాహు దగ్గర 9 కిలోల గంజాయి ఉన్నట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో శ్రీధర్ సాహు ఇంటికి వెళ్లి పరిశీలించగా.. 9 కిలోల 300 గ్రాముల ఎండు గంజాయి దొరికిందన్నారు. ఇద్దరు వ్యక్తుల నుంచి 10 కిలోల 300 గ్రాముల గంజాయి, రెండు సెల్ ఫోన్ లను సీజ్ చేశామన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ తెలిపారు. కేసు ఛేదించిన తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్, కానిస్టేబుళ్లు ప్రసాద్, అనిల్, శ్రీనివాస్ గౌడ్, భిక్షపతి లను ఎస్పీ అభినందించారు.
కోహెడ,వెలుగు: మండలంలోని చెంచల్ చేర్వుపల్లి గ్రామంలో ఓ ఇంటిలో పెంచుతున్న గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ సీఐ పవన్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నారోజు గణేశ్చారి అనే వ్యక్తి ఇంటిలో గంజాయి ఉందనే సమాచారంతో ఎస్ఐ రూప ఆధ్వర్యంలో దాడులు చేసి 830 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు పంపినట్లు
వివరించారు.