
మెదక్, వెలుగు: జిల్లా మీదుగా ఉన్న 44, 765 డీ, 161 నేషనల్ హైవేల మీద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి నెలా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించింది. అక్కడ ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న మలుపుల వద్ద బోల్డర్స్ ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాలు, చౌరస్తాల దగ్గర వెహికల్స్ స్పీడ్ కంట్రోల్ కు చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ సైతం పోలీస్, నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సమావేశం నిర్వహించి ప్రమాదాల నివారణపై చర్చించి, తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రమాదాలు.. మరణాలు ఇలా
ఈ ఏడాది ఆరంభం నుంచి మార్చి నెలాఖరు వరకు జిల్లాలోని ఆయా రోడ్ల మీద 141 ప్రమాదాలు జరిగాయి. ఆయా ప్రమాదాల్లో 58 మంది మృతి చెందగా, 153 మంది గాయపడ్డారు. జనవరిలో 44 ప్రమాదాలు జరిగి 17 మంది, ఫిబ్రవరిలో 46 ప్రమాదాలు జరిగి 16 మంది మార్చిలో 51 ప్రమాదాలు జరిగి 25 మంది ప్రాణాలు కోల్పోయారు.
36 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు
పోలీస్ డిపార్ట్మెంట్ హైవేల మీద రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న 36 బ్లాక్ స్పాట్స్ ను గుర్తించింది. వీటిలో అత్యధికంగా మెదక్ -బాలానగర్ హైవే (765 డీ) రూట్లో 22 బ్లాక్ స్పాట్స్, 44 నేషనల్ హైవే రూట్లో 9 బ్లాక్ స్పాట్స్, 161 నేషనల్ హైవే రూట్లో 5 బ్లాక్ స్పాట్స్ గుర్తించారు. ఆయా చోట్ల ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా 765 డీ హైవే రూట్లో ఎక్కువ శాతం టూ లైన్ రోడ్డు ఉండి డివైడర్ లేక పోవడం, మలుపులు ఎక్కువగా ఉండడం ప్రమాదాలకు కారణాలుగా గుర్తించారు.
ఈ క్రమంలో ఈ రూట్లో 22 బ్లాక్ స్పాట్స్ గుర్తించి ఆయా చోట్ల వెహికల్స్ స్పీడ్ కంట్రోల్ చేసేందుకు మలుపులు ఉన్న చోట్ల రబ్బర్ బోల్డర్స్ ఏర్పాటు చేశారు. రాత్రి వేళ మలుపులు తెలిసేలా రబ్బర్ బోల్డర్స్ కు రేడియం స్టిక్కర్స్ వేశారు. గ్రామాలకు వెళ్లే అడ్డారోడ్లు, చౌరస్తాలు ఉన్న దగ్గర స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేశారు.
స్పీడ్ కంట్రోల్ చేసేందుకు..
నేషనల్ హైవేల మీద వెహికల్స్ ఓవర్ స్పీడ్ మీద వెళ్తుండడం రోడ్డు ప్రమాదాలు జరగడానికి కారణమవుతోంది. ఆయాచోట్ల నిర్ణీత పరిమితిని మించి ఎక్కువ స్పీడ్ గా వెళ్లే వెహికల్స్ ను కంట్రోల్ చేసేందుకు స్పీడ్ గన్స్ ఏర్పాటు చేస్తున్నారు. మద్యం తాగి వెహికల్ నడపడం ప్రమాదాలకు కారణాలుగా గుర్తించిన పోలీసులు హైవేల మీద డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు.
ప్రమాదాలు తగ్గుతున్నాయి
తాము తీసుకుంటున్న చర్యల వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతున్నాయి. ప్రధానంగా నేషనల్ హైవేల మీద బ్లాక్ స్పాట్స్ గుర్తించి ఆయా చోట్ల ప్రమాద నివారణకు అవసరమైన చర్యలు తీసుకున్నాం. 765 డీ హైవే మీద మలుపులు ఉన్న ప్రాంతాల్లో రబ్బర్ బోల్డర్స్ ఏర్పాటు చేయించాం. అవసరమైన చోట సైన్ బోర్డు, రేడియం స్టిక్కర్స్ ఏర్పాటు చేయించాం. దీనివల్ల ప్రమాదాలు చాలా వరకు తగ్గాయి. కలెక్టర్ కూడా పోలీస్, నేషనల్ హైవే అథారిటీ, ఆర్అండ్ బీ అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రమాదాల నివారణకు సూచనలు ఇస్తున్నారు. - ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్పీ, మెదక్