
హైదరాబాద్: హెచ్‌సీఏ అంతర్ జిల్లాల టీ20 క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీని మెదక్ జిల్లా జట్టు కైవసం చేసుకుంది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో మెదక్ 23 రన్స్ తేడాతో కరీంనగర్‌పై నెగ్గింది. టాస్ గెలిచిన మెదక్ 20 ఓవర్లలో 168/4 స్కోరు చేసింది. మహ్మద్ ఆఫ్రిది (80) రాణించాడు. తర్వాత కరీంనగర్ 20 ఓవర్లలో 145/6 స్కోరుకే పరిమితమైంది. ఆఫ్రిదికి హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్‌రావు రూ.50 వేలు నగదు బహుమతి అందించారు. ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మర్ క్యాంప్ జరిపిన వెంటనే టీ20 టోర్నీని నిర్వహిస్తామని జగన్ తెలిపారు. అపెక్స్ కౌన్సిల్‌లో చర్చించి, త్వరలోనే ఈ టోర్నీకి ఒక దిగ్గజ క్రికెటర్ పేరు పెడతామన్నారు.