
- జీలుగ 10,335, పెద్ద జనుము 7,250 క్వింటాళ్లు అవసరం
- అందుబాటులో ఉన్నది జీలుగ 5 వేలు, పెద్ద జనుము 800 క్వింటాళ్లే..
మెదక్/కౌడిపల్లి,వెలుగు : భూసారాన్ని పెంచేం దుకు ఉపయోగపడే పచ్చిరొట్ట విత్తనాలు సరిపోను అందుబాటులో లేక మెదక్ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఈ వానాకాలంలో వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, పెసర, ఉద్యాన వన పంటలు అన్ని కలిపి మొత్తం 3,76,220 ఎకరాల్లో సాగవుతాయని అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్అంచనా వేసింది. ఈ మేరకు ఈ వానాకాలం సీజన్ కోసం పచ్చి రొట్టగా సాగు చేసే జీలుగ విత్తనాలు 10,335 క్వింటాళ్లు, పెద్ద జనుము విత్తనాలు 7,250 అవసరం అని ఇండెంట్ పెట్టారు. కానీ జీలుగ విత్తనాలు కేవలం 5 వేల క్వింటాళ్లు, పెద్ద జనుము విత్తనాలు 800 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి.
స్థానికంగా పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో మండలానికి చెందిన రైతులు తూప్రాన్, సంగారెడ్డి జిల్లా జోగిపేటకు వెళ్లి తెచ్చుకున్నారు. రేగోడ్ మండలానికి 20 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలకు ప్రపోజల్ పంపగా కేవలం 3 క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే వచ్చాయి. కౌడిపల్లి మండలానికి 400 క్వింటాళ్ల జనుము విత్తనాలు అవసరం ఉండగా 220 క్వింటాళ్లు, జీలుగ విత్తనాలు 100 క్వింటాళ్లు అవసరం కాగా కేవలం 30 క్వింటాళ్లు మాత్రమే ఇచ్చారు. అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి ఉండటంతో చాలా మంది రైతులు పచ్చిరొట్ట సాగు చేయలేకపోయారు.
రసాయన ఎరువుల కన్నా పచ్చిరొట్టతో లాభం!
పంటలు బాగా ఎదగాలని, దిగుబడి ఎక్కువ రావాలనే ఉద్దేశ్యంతో రైతులు ఎక్కువ మోతాదులో రసాయనిక ఎరువులు వాడుతున్నారు. దీనివల్ల పెట్టుబడి ఖర్చు విపరీతంగా పెరుగుతోంది. రసాయనిక ఎరువుల వాడకంతో భూసారం కూడా దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో పంటల సాగుకు ముందు పచ్చి రొట్టను సాగు చేయాలని అగ్రికల్చర్ ఆఫీసర్లు సూచిస్తున్నారు. పొలంలో ప్రధాన పంట సాగు చేసే ముందు జనుము, జీలుగ, పిల్లిపెసర, అలసంద లాంటి పచ్చి రొట్ల పైర్లను పూత దశ వరకు పెంచి భూమిలో కలియ దున్నితే భూసారం పెరుగుతుంది. పచ్చిరొట్ట వల్ల అవసరమైన పోషకాలు లభించి పంటల ఎదుగుదలకు, దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది.
విత్తనాల కోసం చాలాసార్లు తిరిగిన
నాకు ఎకరా పొలం ఉంది. పెద్ద జనుము వేస్తే భూమికి బలం ఉంటదని అగ్రికల్చర్ ఆఫీసర్లే చెప్పిన్రు. అందుకు పచ్చిరొట్ట విత్తనాలు వేద్దామని పొలం దున్ని పెట్టిన. కానీ ఎన్నిసార్లు అధికారుల దగ్గరకు వెళ్లినా ఆ విత్తనాలు అయితే దొరకలె.
- కొట్టంల రాఘవేందర్, రైతు, రాజిపేట