ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈసారి ఆలు పంట సాగు చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారు. వారికి పంట వేయాలనే ఆసక్తి ఉన్నా ఆలు విత్తన ధరలు 50 శాతం పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు వెళ్లి విత్తనాలు తీసుకురావాల్సి ఉండటంతో చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
సంగారెడ్డి, వెలుగు : ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతం ఆలుగడ్డ సాగుకు పేరుగాంచింది. పంటకు ఈ ప్రాంతంలోనే అనువైన నేలలు ఉండటంతో జిల్లా మొత్తంలో ఇక్కడే 90 శాతం ఆలు పండుతుంది. గతేడాది 2,850 ఎకరాల్లో ఆలు పంట సాగు చేయగా, ఈసారి 8 వేల ఎకరాల పైచిలుకు సాగు అవుతుందని ఉద్యానవన శాఖ అంచనా వేస్తోంది. అయితే పంట విస్తీర్ణం పెరుగుతున్నా ప్రభుత్వం విత్తన సబ్సిడీ ఇవ్వడం లేదు. పంట చేతికొచ్చాక భూమిలో నుంచి తీసేందుకు యంత్రాలు కూడా ఇవ్వట్లేదు. వీటికి తోడు ఈసారి ఆలు విత్తనం ధర 50 శాతం పెరిగింది. ఇక్కడ విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నుంచి రవాణా ఖర్చులు భరిస్తూ తెచ్చుకోవాల్సి ఉంది. అయితే స్వల్పకాలిక, లాభదాయకమైన పంట కావడంతో ఆలు సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నా విత్తన ధరలు పెరగడంతో అసలు ఈసారి పంట సాగు చేయాలా? వద్దా? అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. పెద్ద రైతులు ఖర్చులు భరించి ఆగ్రా నుంచి విత్తనాలు తెచ్చుకుంటున్నా చిన్న, సన్నకారు రైతులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. చేసేదిలేక వారు వారు దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రస్తుతం క్వింటాల్ విత్తనాలు గతంలో రూ.2వేల లోపు ఉంటే ఈసారి రూ. 3 వేలకు లభిస్తుండగా, దళారులు మాత్రం క్వింటాల్‌కు రూ.4,500 వరకు రైతుల నుంచి వసూల్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదే అదనుగా దళారులు నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
విత్తనాలు సబ్సిడీ కింద ఇవ్వాలి..
ఎకరా పొలంలో ఆలుపంట సాగు చేయాలంటే ఫైనల్‌గా రూ.80 వేలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంది. ఎకరాకు ఏడు క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయి. వీటికి రూ.25 వేల పైచిలుకు ఖర్చు అవుతుండగా, దుక్కి దున్నడం, విత్తనాలు నాటడం, ఎరువుల కోసం రూ.20 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కూలీలు, రవాణా ఖర్చులు, పురుగు మందులు పిచికారి, తదితరవాటికి రూ.40 వేల వరకు ఖర్చు వస్తుంది. ఇవన్నీ కరెక్టుగా ఉంటే ఈ పంట లాభదాయకమైనదే కానీ, ఏటా పెరుగుతున్న ఖర్చులతో చిన్న, సన్నకారు రైతులు ఇబ్బంది పడుతున్నారు. నకిలీ విత్తనాల బెడద కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద విత్తనాలు ఇవ్వాలని చిన్న, సన్నకారు రైతులు కోరుతున్నారు.
నకిలీవి అమ్ముతున్రు..
నాకున్న 20 ఎకరాలలో ఊటా ఆలు పంట పండిస్తున్న. ప్రతి సీజన్ లో విత్తనాలు దొరకక అవస్థలు పడుతున్న. ఇప్పుడు పంట సీజన్ రావడంతో రైతులు విత్తనాల కోసం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా వెళుతున్నరు. అక్కడ 50 కిలోల ఆలు విత్తనం బస్తా రూ.1,150 నుంచి రూ.1,250 వరకు ఉంటుంది. కానీ దళారులు గుజరాత్ నుంచి నాసిరకం విత్తనాలు తెచ్చి ఎక్కువ ధరకు ఆగ్రా పేరుతో అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నరు. దీనిని గుర్తించి ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వమే ఆలు విత్తనాలను అందజేస్తే బాగుంటుంది - నాగేశ్వర్ రెడ్డి, ఆలు రైతు, రంజోల్