
- పురుగుమందు, పెట్రోల్ డబ్బాలతో నిరసన
మెదక్ (చేగుంట), వెలుగు : సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, కాళేశ్వరం కాల్వ నుంచి నీటిని విడుదల చేయించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు సోమవారం చేగుంట – గజ్వేల్ మెయిన్ రోడ్డుపై బైఠాయించి పురుగుమందు, పెట్రోల్ డబ్బాలతో ధర్నా చేశారు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు నీరు అందక ఎండిపోతున్నాయని, మరికొన్ని రోజులు ఇలాగే ఉంటే పంటలు పూర్తిగా దెబ్బతిని పెట్టుబడి కూడా చేతికందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొండ పోచమ్మ సాగర్ నుంచి కాల్వ తవ్వితే తమ పొలాలకు నీరందే అవకాశం ఉన్నా ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఆఫీసర్లు స్పందించి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. విషయం తెలుసుకున్న తొగుట సీఐ లతీఫ్ ఘటనాస్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. నీటివిడుదలకు చర్యలు తీసుకుంటామని ఆఫీసర్లు చెప్పడంతో ఆందోళన విరమించారు.