
- కార్పొరేట్ స్థాయి వసతుల కల్పన
- ఇప్పటికే రూ.9 కోట్లు మంజూరు
- మరో 26 స్కూళ్ల నుంచి ప్రపోజల్స్
మెదక్, వెలుగు: పీఎం శ్రీ ( ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ) పథకంతో సర్కారు బడులకు మహర్దశ పట్టనుంది. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా అన్ని హంగులను కల్పించేందుకు ఈ స్కీమ్ కింద నిధులు మంజూరు చేస్తున్నారు. ఈ స్కీమ్ కింద జిల్లాలో ఫస్ట్ ఫేజ్ లో 20, సెకండ్ ఫేజ్‌లో 11 స్కూల్స్ ఎంపికయ్యాయి. ఇందులో 27 హైస్కూళ్లు ఉండగా.. రెండు ప్రైమరీ స్కూల్స్, ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్, కొల్చారంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) ఉన్నాయి .
పీఎంశ్రీ పోర్టల్‌లో అప్లికేషన్ పెట్టుకుంటే క్లాస్ రూమ్‌లు, ప్లే గ్రౌండ్, కిచెన్ గార్డెన్, వాటర్ హార్వెస్టింగ్ పిట్వంటి బెంచ్ మార్క్‌ల ఆధారంగా స్కూళ్ల ఎంపిక జరుగుతోంది. జిల్లాలో ఇప్పటికే 31 స్కూల్స్ఎంపిక ప్రక్రియ పూర్తయి, పనులు జరుగుతుండగా తాజాగా మరో 26 స్కూల్స్‌కు సంబంధించి ప్రతిపాదనలు పంపారు.
పీఎంశ్రీ స్కీమ్ కింద ఎంపికైన స్కూళ్లలో అన్ని వసతులు కల్పించడంతోపాటు సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ఐదేళ్ల ప్లాన్ రూపొందించి .. ఆయా పనుల చేపట్టేందుకు విడతల వారీగా నిధులు ఇస్తారు. స్కీమ్ కింద 60 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటా భరించాల్సిఉంటుంది. ఒక్కో స్కూల్‌కు కనీసం రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నారు. అవసరమైతే నిధులను పెంచే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. జిల్లాలో ఎంపికయిన 31 స్కూళ్లకు రూ.9 కోట్లు మంజూరయ్యాయి.
ఎంపికైన స్కూళ్లలో మేజర్ రిపేర్స్, అడిషనల్ క్లాస్ రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, కిచెన్ గార్డెన్ డెవలప్మెంట్ పనులు చేపడుతున్నారు. ఆర్వో వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక డెస్క్ టాప్ కంప్యూటర్, ఒక ప్రింటర్ సరఫరా చేయగా త్వరలో ఒక్కో స్కూలుకు 10 డెస్క్ టాప్ కంప్యూటర్లు రానున్నాయి. 20 స్కూల్ లకు 25 ట్యాబ్ లు అందజేశారు. స్టూడెంట్స్ గోల్కోండ కోట వంటి చారిత్రక ప్రదేశాలకు, బిర్లా ప్లానెటోరియం లాంటి చోట్లకు ఎక్స్ పోజర్ విజిట్ కు తీసుకెళ్తున్నారు. స్కూల్ వార్షోకోత్సవాలకు కూడా ఈ నిధులను వినియోగించుకుంటున్నారు.