కమీషన్​లు ఎక్కువ.. పనులు తక్కువ :మైనంపల్లి రోహిత్​రావు

కమీషన్​లు ఎక్కువ.. పనులు తక్కువ :మైనంపల్లి రోహిత్​రావు
  •      పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా అభివృద్ధి శూన్యం
  •      మెదక్​ మున్సిపల్​ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్​రావు

మెదక్ టౌన్, వెలుగు : గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మెదక్​ పట్టణంలో అభివృద్ధి ఏమాత్రం జరగలేదని కమీషన్​లు ఎక్కువ జరిగిన పనులు తక్కువ అన్నట్టు ఉన్నాయని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్​రావు విమర్శించారు. మంగళవారం మెదక్​ మున్సిపల్​ జనరల్​ బాడీ మీటింగ్​ చైర్మన్​  చంద్రపాల్​ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే రోహిత్​రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్​ చంద్రపాల్​ మాట్లాడుతూ.. పట్టణంలోని  ఆయా కూడళ్లలో వివిధ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేశామని ఇదే తరహాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్​ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ విషయంలో కొందరు దళిత సంఘాల నాయకులు మున్సిపల్​ కార్యాలయానికి వచ్చి గొడవకు దిగడం సరికాదన్నారు. బీజేపీ కౌన్సిలర్​ మేఘమాల మాట్లాడుతూ.. బ్రాహ్మణవీధిలో మురికి కాలువలు శిథిలావస్థకు చేరాయని కనీసం నీరు బయటకు పోలేని పరిస్థితి నెలకొందని సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన చైర్మన్​పట్టణంలో నిర్మించిన రైతుబజార్​ పూర్తయిందని, కాంట్రాక్టర్​కు డబ్బులు ఇచ్చినట్లయితే మున్సిపాలిటీకి స్వాధీనం చేస్తారని దీంతో సమస్య తీరుతుందన్నారు.  కౌన్సిలర్​ భీమరి కిశోర్​ మాట్లాడుతూ...

ఔరంగాబాద్, అవుసులపల్లి గ్రామాలను మెదక్​ మున్సిపాలిటీలో విలీనం చేశారని ఆ సమయంలో అభివృద్ధి నిధుల కింద కోటి రూపాయలు ఇస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ అతీగతీ లేవన్నారు. మిషన్​ భగీరథ నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పి ఇప్పుడు బిల్లులు వసూలు చేయడం ఏంటని కౌన్సిలర్​ మేడి కల్యాణి సభలో ప్రస్తావించారు. ఈ విషయమై మున్సిపల్​ కమిషనర్​ జానకీరామ్​ సాగర్​ స్పందిస్తూ అప్పటి ప్రభుత్వం సూచనల మేరకు వాటర్​ ఛార్జెస్​అసెస్​మెంట్​ జీవో నెంబర్​ 180 ప్రకారం పన్నులు వసూలు చేశామని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్​ రావు మాట్లాడుతూ..

బీఆర్ఎస్​ ఎమ్మెల్యే పదేళ్లు అధికారంలో ఉన్నపుడు  పట్టణ సమస్యలు  వారి దృష్టికి తీసుకెళ్లారా  అంటూ ఆయన ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు.  పదేళ్ల నుంచి గుర్తుకు రాని సమస్యలు తాను ఎమ్మెల్యే అయిన రెండు నెలల కాలంలోనే అదీ మొదటిసారి మున్సిపల్​ సమావేశానికి వచ్చిన సమయంలోనే గుర్తుకు వస్తున్నాయా అన్నారు.  పదేళ్లపాటు మెదక్​ పట్టణాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారని అభివృద్ధి ఎందుకు చేయలేదని కౌన్సిలర్లందరూ మాజీ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించి ధర్నా చేయాలన్నారు. ప్రజలకు సేవ చేయడానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని అవసరమైన ప్రత్యేక నిధులు తెప్పించి అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.