బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు అరెస్ట్ అయ్యారు. వెలిమల తండాలో ఎంపీ రఘునందన్‌రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు పటాన్‌చెరు పీఎస్‌కు తరలించినట్లు సమాచారం. రఘునందన్ రావు అరెస్ట్ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పటాన్ చెరు పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటున్నారు. కాగా, సంగారెడ్డి జిల్లా వెలిమల తండాలో గత 10 రోజులుగా గిరిజనులు ఆందోళన చేపడుతున్నారు. ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కొవద్దంటూ గిరిజనులు నిరసన వ్యక్తం చేస్తున్నారు
గిరిజనుల ఆందోళనకు మద్దతు తెలిపిన ఎంపీ రఘుందన్ రావు.. శుక్రవారం (జనవరి 17) స్వయంగా వెలిమల తండాకు వెళ్లి ఆందోళనలో పాల్గొన్నారు. ఉదయం నుండి గిరిజనులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వచ్చి గిరిజనులకు న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఎంపీ బీష్మించుకుర్చున్నారు.
ఎంపీ రఘునందన్ రావు ఆందోళన నేపథ్యంలో పలిమెల తండాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రఘునందన్ రావును అరెస్ట్ చేశారు. రఘునందన్ రావును అదుపులోకి తీసుకునే క్రమంలో బీజేపీ కార్యకర్తలు, గిరిజనులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఉద్రిక్త పరిస్థితుల నడుమనే ఎంపీ రఘునందన్ రావును అదుపులోకి తీసుకుని పఠాన్ చెరు పీఎస్‌కు తరలించారు పోలీసులు.