జన్వాడ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ కలకలం రేపింది. అక్టోబర్ 26 (శనివారం) రిజర్వుడ్ కాలనీలోని రాజ్ పాకాల (కేటీఆర్ బామ్మర్ది) ఫామ్ హౌస్ లో ఏం జరిగిందో బయటపెట్టాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావ్ ఆదివారం గజ్వేల్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఓ వైపు డ్రగ్స్ రహిత తెలంగాణ చేస్తామంటూ ప్రకటిస్తుంటే.. మరో వైపు శని, ఆదివారాలు వచ్చాయంటే రేవ్ పార్టీలని, రావుల పార్టీలని విచ్చలవిడిగా డ్రగ్స్ దందా జరుగుతుందని అన్నారు.
విదేశీ మాదక ద్రవ్యాలతో పాటు, ఫారిన్ లిక్కర్, కొకైన్ తీసుకొచ్చి భాగ్యనగరంలో డ్రగ్స్ దందా చేస్తున్నారని రఘనందన్ మండిపడ్డాడు. శనివారం రాత్రి హైదారాబాద్ శివార్లలోని జన్వాడా ఫాం హౌస్ లో అర్ధరాత్రి రేవ్ పార్టీ జరుగుతుందని, అందులో చాలామంది వీఐపీ పిల్లలు ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయని ఆయన అన్నారు. వెంటనే రాజ్ పాకాల ఫామ్ హౌస్ రేవ్ పార్టీలో ఏం జరిగిందో సీసీఫుటేజ్ రిలీజ్ చేయాలని డీజీపీ జితేందర్ ను కోరారు మెదక్ ఎంపీ.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఫాం హౌస్ ఓనర్ రాజ్ పాకాలతో కుమ్మక్కు కాకపోతే.. డీజీపీ ఆ ఫాం హౌస్ చుట్టూ ఉన్న సీసీఫుటేజ్ ను వెంటనే రిలీజ్ చేయాలని ఆయన అన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల్లోగా ఫామ్ హౌస్ లో రాత్రి ఏం జరిగిందో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. సమయం మించిపోతే సీసీటీవీ ఫుటేజ్ ఎడిట్ చేసి, సాక్ష్యాలు తారుమారు చేస్తే అవకాశం ఉంటుందని ఎంపీ రఘనందన్ రావు అన్నారు.