బీసీలు సగం ఉంటే రెండు పదవులే ఇచ్చారు! : ఎంపీ రఘునందన్ రావు విమర్శ

బీసీలు సగం ఉంటే రెండు పదవులే ఇచ్చారు! : ఎంపీ రఘునందన్ రావు విమర్శ
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా

సిద్దిపేట రూరల్, వెలుగు: రాష్ట్ర జనాభాలో బీసీలు సగానికి పైగా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులే ఇచ్చారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. కేంద్రంలోని మోదీ సర్కార్ లో అన్నివర్గాలకు సమన్యాయం కల్పించారని పేర్కొన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్ లో పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని, బీఆర్ఎస్ పోటీలో లేనందున, బీజేపీ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ గడ్డ సిద్దిపేట, కరీంనగర్ అంటూ చెప్పుకుని తిరిగే బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలబెట్టలేదని ఎద్దేవా చేశారు. అధికంగా మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఎక్కువ ఓట్లు పడతాయని పేర్కొన్నారు. గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు మండలిలో టీచర్లు, గ్రాడ్యుయేట్ల సమస్యలపై పోరాడకుండా తమ సొంత పనుల్లో బిజీ అయ్యారని విమర్శించారు

ఇప్పుడు బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకలుగా నిలుస్తారన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి ఖాయమని చెప్పకనే చెప్పారని పేర్కొన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేని హామీలు ఇచ్చి మోసం చేసిందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ఇన్ చార్జ్ లక్ష్మారెడ్డి, నేతలు హైందవి రెడ్డి, జస్వంత్ రెడ్డి, కొత్తపల్లి వేణుతదితరులు పాల్గొన్నారు.