
- రాహుల్.. విదేశాలకు వెళ్లినప్పుడే దేశంలో హింస
- 27 మంది చనిపోతే
- సోకాల్డ్ మేధావులు స్పందించరా?
- ఓవైసీ కుటుంబం వల్లే పాతబస్తీ అభివృద్ధి చెందలేదు
- మెదక్ ఎంపీ రఘునందన్ రావు కామెంట్స్
సిద్దిపేట రూరల్, వెలుగు: పహల్గామ్ ఉగ్రదాడితో దేశాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరుగుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడే దేశంలో హింసకు కుట్ర జరుగుతుందని, అమెరికా వైస్ ప్రెసిడెంట్ పర్యటిస్తుండగా మనదేశంలో శాంతి లేదని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా ఆఫీసులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
హిందూ సమాజంపై దాడిని సోకాల్డ్ మేధావులు ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. పహల్గాం ఘటనపై నోరు మెదపని పార్టీలు, సూడో మేధావులను హిందూ సమాజం సోషల్ బాయ్ కాట్ చేయాలని సూచించారు. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించాల్సి వస్తే చివరి ముస్లిం వరకు పాకిస్తాన్ కు పంపించాల్సిందేనని బీఆర్ అంబేద్కర్ ఆనాడే చెప్పాడని ఆయన గుర్తు చేశారు. హిందు సమాజంపై దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని, ప్రధాని మోదీ నాయకత్వంలో ఉగ్రవాదుల ఆటకట్టిస్తామన్నారు.
పాతబస్తీలో అభివృద్ధి జరగక పోవడానికి కారణం ఎంఐఎం, ఓవైసీ కుటుంబమేనని, వక్ఫ్ బోర్డు పేరుతో వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుని, ముస్లింలను పేదరికంలో ఉంచుతున్నారని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, నేతలు కొత్త వేణు గోపాల్, రామచంద్రం, సంతోష్ పాల్గొన్నారు.