ఎమ్మెల్సీ బరిలో జిల్లా నేతలు..ముగ్గురికి ఖరారు.. ప్రయత్నాల్లో మరో ఇద్దరు

ఎమ్మెల్సీ బరిలో జిల్లా నేతలు..ముగ్గురికి ఖరారు.. ప్రయత్నాల్లో మరో ఇద్దరు

మెదక్/సిద్దిపేట/ సంగారెడ్డి, వెలుగు: మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఎక్కువ మంది బరిలో ఉండనున్నారు. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులకు టికెట్లు ఖరారు కాగా, మరో ఇద్దరు టికెట్​ప్రయత్నాల్లో ఉన్నారు. 

టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పీఆర్టీయూ టీఎస్ నుంచి వంగా మహేందర్ రెడ్డి, టీపీటీఎఫ్ నుంచి వై.అశోక్ కుమార్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ నుంచి అంజిరెడ్డి అభ్యర్థిత్వం ఖరారైంది. మరోవైపు టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో సిద్దిపేట జిల్లాకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి, మెదక్ జిల్లా నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన మామిడి సుధాకర్ రెడ్డి  ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

సిద్దిపేట జిల్లా నుంచి..

సిద్దిపేట జిల్లా నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతుండగా ఇద్దరికి టికెట్లు ఖరారు కాగా, మరో అభ్యర్థి టికెట్​ప్రయత్నాల్లో ఉన్నారు. టీపీఆర్టీయూ టీఎస్ అభ్యర్థిగా వంగ మోహన్ రెడ్డి పేరు, టీపీటీఎఫ్ తరపున గజ్వేల్ కు చెందిన వై.అశోక్ కుమార్ అభ్యర్థిత్వం ఖరారు కాగా,  సిట్టింగ్​ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి మళ్లీ ఎన్నికల బరిలో నిలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

 రాష్ట్రంలోని  33 జిల్లాల పీఆర్టీయూ నేతల మద్దతు  సిద్దిపేటకు చెందిన వంగ మహేందర్ రెడ్డికి లభించడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని ఆ యూనియన్​అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆయన  ప్రచార రంగంలోకి దిగారు. పీఆర్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి ఇద్దరూ సిద్దిపేటకు చెందిన వారే కావడం గమనార్హం. 

మద్దతు ప్రయత్నాల్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ

టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో రెబెల్ గా దిగాలని భావిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి మద్ధతు ప్రయత్నాలు  ముమ్మరం చేశారు. ఇటు ఉపాధ్యాయ సంఘాలతో పాటు అధికార పార్టీ నేతల మద్దతు పొందే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. తుఫ్రాన్ మున్సిపాలిటీలో చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటేసి పార్టీకి మరింత దగ్గరయ్యారు. వచ్చే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచి తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవాలని రఘోత్తంరెడ్డి ప్రయత్నిస్తున్నారు. చిన్నకోడూరు మండలం గోనెపల్లికి చెందిన రఘోత్తం రెడ్డి ఆరేండ్ల ఎమ్మెల్సీ పదవీ కాలం త్వరలో ముగియనుంది. 

వ్యూహాత్మకంగా వంగ అడుగులు

పీఆర్టీయూ అభ్యర్థిగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్న వంగ మహేందర్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.  సిద్దిపేట అర్బన్  మండలం మందపల్లికి చెందిన వంగ మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేయడం కోసం రెండేళ్ల కింద టీచర్​ఉద్యోగానికి రాజీనామా చేసి వీఎంఆర్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ముఖ్యంగా నియోజకవర్గ పరిధిలోని 13 జిల్లాల పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లలో స్వచ్ఛంద సంస్థ తరపున వివిధ సేవా కార్యక్రమాలతో ఉపాధ్యాయులకు దగ్గరయ్యారు. అవగాహన సదస్సులు, ఆత్మీయ సమ్మేళనాలతో మహేందర్ రెడ్డి టీచర్ల వద్దకు వెళ్తూ మద్ధతు కోరుతున్నారు.

బీజేపీ నుంచి అంజిరెడ్డి

ఉమ్మడి మెదక్, -నిజామాబాద్, ఆదిలాబాద్,- కరీంనగర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ సి.అంజిరెడ్డి బరిలో నిలుస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుకు చెందిన అంజిరెడ్డి పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండి సేవలందిస్తున్నారు. ప్రజలకు ఆయన చేస్తున్న సేవలను గుర్తించి పట్టభద్రులు గెలిపిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న ఆయనకు పలు గ్రాడ్యుయేట్ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. 

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎల్లుపేటకు చెందిన మామిడి సుధాకర్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. ఆయన గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఆయన ఇప్పుడు మళ్లీ పోటీకి సిద్ధపడుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీ మద్దతు కోసం సుధాకర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.