
కౌడిపల్లి, వెలుగు: మెదక్జిల్లాలో ఎదురుగా వచ్చిన స్కూటీని ఓ కారు ఢీకొట్టడంతో ఇద్దరు వలస కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసలు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొందరు కొన్ని సంవత్సరాలుగా నర్సాపూర్మండలం రెడ్డిపల్లి వద్ద ఉన్న సిమెంట్ స్తంభాల తయారీ షాపులో పనిచేస్తున్నారు. వారిలోని అనుజ్‌కుమార్(25), సరోజ్(26), కన్నయ్య అనే ముగ్గురు గురువారం రాత్రి సరుకుల కోసం స్కూటీపై కౌడిపల్లి మండల వెంకట్రావుపేటకు వెళ్లారు. అర్ధరాత్రి తర్వాత తిరిగి వస్తుండగా, తునికి రామానాయుడు గేటు వద్ద ఎదురుగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనుజ్ కుమార్, సరోజ్ తీవ్రంగా గాయపడి స్పాట్లోనే చనిపోయారు. కన్నయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కౌడిపల్లి ఎస్సై శివప్రసాద్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.