
- సెంటర్ల నుంచి మిల్లులకు తరలించడంలో ఇబ్బందులు
- లారీల కొరతతో పాటు మిల్లుల్లో తరుగు పేరిట మోసం
- ప్రతిరోజూ ఏదోచోట ఆందోళనకు దిగుతున్న రైతులు
సిద్దిపేట, వెలుగు: వానాకాలం సీజన్ ప్రారంభమైనా యాసంగి ధాన్యం కొనుగోలు పూర్తి కావడం లేదు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చినప్పటి నుంచి అకౌంట్‌లో డబ్బులు పడే వరకు నెల నుంచి రెండు నెలల సమయం పడుతోంది. ఈ ప్రాసెస్‌లో నిత్యం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సెంటర్లలో రెండు వారాలు అయితే గాని తూకం వేయడం లేదు. తూకం అయ్యాక లారీల కొరత కారణంగా మిల్లులకు తరలించేందుకు మరో రెండు వారాలు పడుతోంది. అక్కడా అన్‌లోడింగ్‌కు నాలుగైదు రోజులు టైం పట్టడమే కాదు తరుగు పేరిట ఇబ్బందులు పెడుతున్నారు. ఇది దాటుకొని వానాకాలం సాగుకు ప్రారంభిద్దామనుకుంటే అకౌంట్లలో డబ్బులు పడడం లేదు. ఉమ్మడి జిల్లాలో11.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం టార్గెట్ కాగా ఇప్పటి వరకు 6.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. దీని విలువ రూ. 1280 కోట్లు కాగా రూ. 613 కోట్లు మాత్రమే రైతులకు చెల్లించారు. మరో రూ. 667 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
రోడ్డెక్కుతున్న రైతులు
కొనుగోళ్లు ప్రారంభమై దాదాపు 40 రోజులు కావస్తున్నా రైతులు ప్రతి రోజు ఏదో ఒకచోట ఆందోళనకు దిగుతున్నారు. కేంద్రాల్లో గన్నీ బ్యాగులు, లారీల కొరత , హమాలీల సమస్య, మిల్లుల్లో తరుగు, అకాల వర్షాలతో వడ్లు తడవడం తదితర సమస్యలపై రోడ్డెక్కుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ ఒక్కరోజే రెండు చోట్ల రైతులు ఆందోళనకు దిగడం పరిస్థితికి అద్ధం పడుతోంది. హుస్నాబాద్, అక్కన్నపేట, హత్నూర, గుమ్మడిదల, శివ్వంపేట, పాపన్నపేట, నిజాంపేట, మెదక్, నర్సాపూర్, జిన్నారం తదితర మండలాల్లోనూ రాస్తారోకోలు చేశారు.
స్టోరేజీ సమస్యలు
గన్నీ బ్యాగులు, లారీలు, హమాలీల కొరతతో పాటు స్టోరేజీ సమస్యలు కూడా కొనుగోళ్లలో జాప్యానికి కారణంగా తెలుస్తోంది. సిద్దిపేటలో 63,510 మంది రైతుల నుంచి 2.69 మెట్రిక్ టన్నులు, సంగారెడ్డిలో 19 వేల మంది రైతుల నుంచి 1.19 లక్షల మెట్రిక్ టన్నులు, మెదక్‌లో 57,102 రైతుల నుంచి 2.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 400 రైసు మిల్లులు ఉన్నా.. గత సీజన్‌కు సంబంధించిన ధాన్యం నిల్వ ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు కొన్ని ప్రాంతాల్లో స్టోరేజీ కోసం పాత ప్రభుత్వ భవనాలు చూసినా అవి సరిపోవడం లేదు. మెదక్ సంబంధించిన వడ్లను కామారెడ్డికి పంపేందుకు అనుమతి రావడంతో అక్కడ కొంత మేర సమస్య తీరినా.. సిద్దిపేట, సంగారెడ్డిలో మాత్రం అలాగే ఉంది.
ఈయన కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్. 25 రోజుల కింద ఐకేపీ సెంటర్‌లో 179 క్వింటాళ్ల ధాన్యాన్ని అమ్మాడు. రూ. 3.58 లక్షలు రావాల్సి ఉండగా.. నేటికీ అకౌంట్లలో పడలేదు. అధికారులను అడిగితే రేపు మాపు అంటున్నరు. దీంతో వానాకాలం పంట పెట్టుబడికి ఇబ్బంది తప్పట్లేదు. ఈయన జగదేవ్ పూర్ మండలం మునిగడపకు చెందిన భాస్కర రెడ్డి. 15 రోజుల కింద వడ్లను కొనుగోలు కేంద్రానికి తెచ్చాడు. 10 రోజుల కింద గోనె సంచులు ఇవ్వగా నింపి ఐదు రోజులుగా తూకం కోసం ఎదురు చూస్తున్నాడు. ఐకెపీ సిబ్బందిని అడిగితే సీరియల్ నెంబర్ ప్రకారం కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు. దీంతో రైతు 15 రోజులుగా సెంటర్‌లోనే ఉండాల్సి వస్తోంది.
పది రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేస్తాం
సమస్యలను పరిష్కరించి త్వరలోనే ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తాం. వడ్లను వెంటవెంటనే కొనడంతో పాటు తరుగు పేరిట మిల్లర్లు ఇబ్బందులు పెట్టకుండా చర్యలు తీసుకుంటున్నాం. లారీలు, హమాలీల సమస్య కూడా చాలావరకు పరిష్కరించింది. సిద్దిపేట జిల్లాలో 61 సెంటర్ల లో కొనుగోళ్లు పూర్తి కావడంతో క్లోజ్ చేశాం. పదిరోజుల్లో కొనుగోళ్లు కంప్లీట్ చేసి రైతులకు డబ్బులు చెల్లిస్తాం.
- బ్రహ్మారావు, డీఎస్‌వో