వాడివేడిగా మెదక్​ జడ్పీ మీటింగ్​

వాడివేడిగా మెదక్​ జడ్పీ మీటింగ్​
  •   నేలపై కూర్చొని నిరసన.. సభ నుంచి వాకౌట్ ​చేసిన నిజాంపేట జడ్పీటీసీ
  •    అధిరుల తీరుపై నారాయణఖేడ్​ ఎమ్మెల్యే ఆగ్రహం

మెదక్, వెలుగు :  ప్రశ్నలు, విమర్శలు, వాదోపవాదాలతో మెదక్​ జడ్పీ జనరల్​బాడీ మీటింగ్​ వాడివేడిగా జరిగింది. సోమవారం చైర్​ పర్సన్​ హేమలత అధ్యక్షతన కలెక్టరేట్​లో జరిగిన మీటింగ్​లో కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నారాయణఖేడ్​ ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి ​పాల్గొన్నారు. బీజేపీకి చెందిన నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్​కుమార్​మాట్లాడుతూ మెదక్​ లో రైల్వే రేక్​ పాయింట్ ఓపెన్​ చేసి వసతులు సమకూర్చక పోవడంతో కేవలం ఒక్కసారి  మాత్రమే ఎరువుల స్టాక్​ వచ్చిందని తెలిపారు. మన ఊరు మన బడి కింద పనులు చేసినా బిల్లులు రావడంలేదన్నారు.

నిజాంపేట ప్రైమరీ స్కూల్​కు రూ.1.80 కోట్లు మంజూరైనా కాంట్రాక్టర్లను రానివ్వకపోవడంతో పనులు మొదలు కాలేదని చెప్పారు. మెదక్​ నుంచి వుమెన్స్​ డిగ్రీ కాలేజీ తరలిపోయినా పట్టించుకునే వారు లేరని విమర్శించారు. ఆఫీస్ లకు బిల్డింగులు అద్దెకు ఇప్పిస్తే కిరాయి రాకపోవడంతో ఓనర్లు తమ ఇంటికి వచ్చి కూర్చుంటున్నారని, ఇప్పుడు మళ్లీ కేజీబీవీకి బిల్డింగ్​చూడమనడం ఏంటని ప్రశ్నించారు. కొత్తగా ఏర్పాటైన నిజాంపేట మండల కేంద్రంలో పీహెచ్​సీ ఏర్పాటు విషయంలో మాటలే తప్ప పనులు జరగడం లేదన్నారు.  

ఇలా నిజాంపేట జడ్పీటీసీ విజయ్​ కుమార్​ అన్ని డిపార్ట్​మెంట్​ చర్చల్లో అధికారులను నిలదీయడం, ప్రశ్నిస్తుండటంతో వెల్దుర్తి బీఆర్​ఎస్​ జడ్పీటీసీ రమేశ్​గౌడ్, శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ, కోఆప్షన్​ మెంబర్​ యూసుఫ్​ తదితరులు అభ్యంతరం తెలిపారు. ‘అన్ని అంశాల్లో నువ్వే జోక్యం చేసుకుంటూ చాలా సేపు మాట్లాడటం ఏంటి?  సభలో అందరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి’ అంటూ అడ్డు చెప్పారు. దీంతో అటు విజయ్​ కుమార్​కు, ఇటు బీఆర్​ఎస్ జడ్పీటీసీ, ఎంపీపీలకు మధ్య వాగ్వాదం జరిగింది.

జడ్పీటీసీ విజయ్​ కుమార్​ ప్రశ్నలపై ఎమ్మెల్సీ యాదవరెడ్డి స్పందిస్తూ గతంలో యూరియా కోసం చెప్పులు క్యూలైన్​లో పెట్టాల్సిన పరిస్థితి ఉండేదని, బీఆర్​ఎస్​​ ప్రభుత్వం వచ్చాక ఆ సమస్యే లేదన్నారు. నారాయణఖేడ్​ ఎమ్మెల్యే భూపాల్​ రెడ్డి జోక్యం చేసుకుని ప్రతిది నెగెటివ్​ గా తీసుకోవద్దని, సమస్య ఏదైనా ఉంటే సంబంధిత డిపార్ట్​మెంట్​చర్చ వచ్చినప్పుడు చెప్పాలన్నారు. బీఆర్​ఎస్​ జడ్పీటీసీ, ఎంపీపీలు అందరూ లేచి నిజాంపేట జడ్పీటీసీ విజయ్​ కుమార్​ తీరుపై అభ్యంత్రం వ్యక్తం చేశారు.

దీంతో విజయ్​ కుమార్​ అధికార పార్టీకి చెందిన సభ్యులు సభలో తన గొంతు నొక్కేస్తున్నారంటూ కుర్చీలో నుంచి లేచి సభా వేదిక ముందు కింద కూర్చొని నిరసన తెలిపారు. అనంతరం సభ నుంచి బయటికి వెళ్లిపోయారు. 

ఎమ్మెల్యే ఫైర్​....

పనులు, బిల్లుల విషయంలో పంచాయతీరాజ్​ శాఖ అధికారులు, డీపీఓ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పనులు కావడం లేదన్నారు. తన పరిధిలో ఈ ఆఫీసులు ఉండి ఉంటే లీవ్ పెట్టి వెళ్లిపొమ్మనే వాడినని, లేదంటే కొట్టి వెళ్లగొట్టాలన్నంత కోపం వస్తోందని పంచాయతీరాజ్​ ఈఈ, డీపీఓలను ఉద్దేశించి అన్నారు. ‘ఎమ్మెల్యే అయిన నేను కాకుండా నారాయణఖేడ్​ నుంచి ఇంకెవరైనా ఫోన్​ చేసి చెప్పాల్నా  మీకు.  

నేను ఈ రోజు మీ ఇద్దరిని క్లాస్​ తీసుకునేందుకే జడ్పీ మీటింగ్​కు వచ్చాను, మీరు రాజకీయం చేయదలచుకుంటే​ ఉద్యోగానికి రిజైన్​ చేసి చేయండి’ అంటూ  డీపీఓ సాయిబాబాపై మండి పడ్డారు. మంత్రి, ఎమ్మెల్యేలు గైర్హాజరు జడ్పీ మీటింగ్​కు జిల్లా మంత్రి హరీశ్​ రావు, మెదక్, నర్సాపూర్, అందోల్​, చేగుంట ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్​ రెడ్డి, మదన్​ రెడ్డి, క్రాంతి కిరణ్​, రఘునందన్​ రావు గైర్హాజర్​ అయ్యారు. మూడు నెలలకు ఒకసారి జరిగే జనరల్ బాడీ మీటింగ్​కు ఎమ్మెల్యేలు రాకపోవడం చర్చనీయాంశమైయింది.