ఇక మూడు రాష్ట్రాల్లో గెలిస్తే.. కాంగ్రెస్ పని ఖతం

ఇక మూడు రాష్ట్రాల్లో గెలిస్తే.. కాంగ్రెస్ పని ఖతం
  • మెదక్ ఎంపీ రఘునందన్ రావు 

మెదక్, వెలుగు: ప్రధాని మోదీ కలలుగన్న కాంగ్రెస్ ముక్త్ భారత్  కల సాకారానికి.. ఇక మూడడుగుల దూరమే ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మరో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటైతే 125 ఏండ్ల చరిత్ర ఉందని చెప్పుకునే కాంగ్రెస్ పని ఖతమవుతుందన్నారు. ఆదివారం కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి మెదక్ లో పార్టీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. 

అవినీతి ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులను ప్రజలు ఇంటికి పంపుతున్నారని చెప్పారు. కాళేశ్వరం, భూ కబ్జాలతో తెలంగాణలో లక్షల కోట్లు దోచుకున్న  బీఆర్ఎస్ ని ప్రజలు ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపారన్నారు. ఇపుడు ఢిల్లీలోనూ అదే జరిగిందన్నారు. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడి, అవినీతి రహిత పరిపాలన అందిస్తానని అధికారంలోకి వచ్చిన ఆప్ అధినేత కేజ్రీవాల్ అదే అవినీతి బురదలో కూరుకుపోయారని విమర్శించారు. 

చెల్లెమ్మ కవితతో కలిసి సీసాలు అమ్మి శీష్ మహల్ కట్టుకున్నారని ఆరోపించారు. ఏ రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన అవినీతికి తావు లేకుండా సుపరి పాలన అందించే బీజేపీకి మాత్రమే దేశంలో భవిష్యత్  ఉంటుందన్నారు. తెలంగాణలో రానున్న ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం ఇప్పటి నుంచే కృషి చేయాలని క్యాడర్ కు పిలుపు నిచ్చారు. 

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్​రావు, ఎమ్మెల్సీ కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సెగ్మెంట్ లో ఆ పార్టీకి అభ్యర్థులను పెట్టే దిక్కులేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తాను ఫామ్ హౌస్ నుంచి లేస్తే సత్తా చూపిస్తా అంటున్నారని, కానీ లేచే శక్తి లేదని విమర్శించారు.