మేడారం జాతరకు కోటి మందికి పైగా భక్తులు వస్తరు. జాతర మూడు రోజులు మస్తు రద్దీ ఉంటది. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు వరంగల్ నగరంల ట్రాఫిక్‌తో పరేషాన్ కాకుండా యాదగిరిగుట్ట నుంచి వరంగల్ నగరంలోని ఆరెపల్లి దాక బైపాస్‌రోడ్డు పనులు మూడేండ్ల కిందట షురూ చేసిన్రు. ఇప్పటికీ పనులు పూర్తిగాలె. పనులు కానికి ఇంక రెండు నెలల టైం పడ్తదని ఆఫీసర్లు అంటున్నరు. అంటే జాతరకొచ్చెటోళ్లు ఈసారిగూడ వరంగల్నగరంల ట్రాఫిక్ తో పరేషాన్కావాల్సిందే.
రెండేళ్లకోసారి నిర్వహించే మేడారం మహాజాతరకు కోటికి పైగా భక్తులు వస్తుంటారు. వేలాది సంఖ్యలో వాహనాలు తరలివస్తుంటాయి. హైదరాబాద్– -వరంగల్ మార్గంలో వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్-భూపాలపట్నం హైవే(ఎన్‌హెచ్-163)కి బైపాస్‌గా యాదగిరిగుట్ట నుంచి వరంగల్ నగరంలోని ఆరెపల్లి వరకు 99 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణాన్ని చేపట్టారు. దీనికి సంబంధించిన పనులు 2017లో ప్రారంభమయ్యాయి. 2019 మార్చి నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. సుమారు రూ.900 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టిన ఎల్అండ్ టీ కంపెనీకి ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో దాదాపు 75 శాతం అంటే దాదాపు 670 కోట్ల వరకు ముట్టాయి. 2020లో జరిగే మేడారం జాతరకు బైపాస్అందుబాటులోకి వస్తుందని అంతా భావించారు. కానీ మందకొడిగా సాగడంతో మూడేళ్లు గడిచినా ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇంకో నాలుగు రోజుల్లో మేడారం జాతర ప్రారంభం కానున్నప్పటికీ రోడ్డు పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ కాకపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పలా కనిపించడం లేదు.
పెరగనున్న రద్దీ
మేడారం జాతరకు హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి భక్తులు వరంగల్ మీదుగానే వెళుతుంటారు. ఈసారి జాతర ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరగనుంది. జాతర ప్రారంభమైనప్పటి నుంచి వరంగల్ మీదుగా మేడారం వెళ్లే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సమ్మక్క గద్దెకు వచ్చే రోజుల్లో ఈ రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. అయితే వాహనాలు నగరంలో ప్రవేశించకుండా బైపాస్ రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో ట్రాఫిక్‌ను నగరం మధ్య నుంచి మళ్లించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎట్ల వచ్చినా జంక్షన్లు దాటాల్సిందే
యాదగిరిగుట్ట నుంచి పనులు ప్రారంభించి మధ్యమధ్యలో రోడ్డు మార్గాలు, రైల్వే లైన్లు ఉన్న చోట్ల బ్రిడ్జిలు కూడా నిర్మించారు. కానీ వరంగల్ సమీపంలోని చింతగట్టు క్యాంపు సమీపంలో వరంగల్-కరీంనగర్ హైవేపై చేపట్టిన బ్రిడ్జి పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో అక్కడి నుంచి మళ్లీ నగరంలో ప్రవేశించక తప్పని పరిస్థితి. చింతగట్టు బ్రిడ్జి నుంచి కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) క్రాస్ మీదుగా పెగడపల్లి డబ్బాలు, రెడ్డికాలనీ, పెద్దమ్మగడ్డ మీదుగా ఏటూరునాగారం హైవే ఎక్కాల్సి ఉంటుంది. అలా కాకుండా జనగామ, స్టేషన్ ఘన్పూర్, కాజీపేట మీదుగా వస్తే.. ఫాతిమానగర్ బ్రిడ్జి వద్ద ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి. ఇలా నగరం మధ్య నుంచి వెళ్లడం వల్ల నాలుగైదు చోట్ల జంక్షన్లు దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్లినా ట్రాఫిక్‌లో ఇరుక్కోక తప్పదు. అంతేగాకుండా అరెపల్లి వద్ద దామెర క్రాస్ వద్ద రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండటంతో అక్కడ పోలీసులు డైవర్షన్ ఏర్పాటు చేశారు. కానీ అక్కడ రోడ్డు మార్గం ఇరుకుగా ఉండటంతో ప్రయాణికులకు ట్రాఫిక్ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా నిర్మిస్తున్న రోడ్డు పనులు సకాలంలో పూర్తి చేస్తే ఈ ఇబ్బందులు ఎదురయ్యేవి కావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భూసేకరణతోనే ఆలస్యం
ఎన్‌హెచ్163 బైపాస్ రోడ్డు పనులు పూర్తి కావడానికి ఇంకా రెండు నెలల సమయమైనా పట్టే అవకాశం ఉంది. రోడ్డు పనులు చేపట్టిన ప్రారంభంలో భూసేకరణ, కోర్టు కేసుల వల్ల పనులు కాస్త ఆలస్యమైన విషయం వాస్తవమే. ఇప్పటికే 90 శాతం వరకు రోడ్డు పనులు పూర్తి అయ్యాయి. ఇంకో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. – శ్రీనివాసరావు, ఎన్హెచ్ఏఐ పీడీ