ములుగు, వెలుగు: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్తున్న భక్తుల ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం జనగామ జిల్లా లింగాలఘనపూర్ గ్రామానికి చెందిన 20 మంది భక్తులు ట్రాక్టర్లో మేడారం బయలుదేరారు. ములుగు జిల్లా మహ్మద్‌గౌస్ పల్లి వద్ద హనుమకొండ నుంచి మేడారం వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టుకుంటూ వెళ్లింది. దీంతో ఒక్కసారిగా ట్రాక్టర్ట్రాలీ పల్టీ కొట్టి బోల్తా పడింది. ట్రాలీలోని ఆరుగురి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
రాములమ్మ అనే మహిళకు సీరియస్‌గా ఉన్నట్లు తెలిసింది. అయితే ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ఆపకుండా వెళ్లిపోవడంతో బాధితులు రోడ్డుపై ధర్నాకు దిగారు. ములుగు వైపు వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. దీంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మేడారం వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బస్సు డ్రైవర్‌ను తీసుకురావాలని బాధితులు డిమాండ్‌చేశారు. ములుగు సీఐ రంజిత్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గురైన ట్రాక్టర్‌ను పక్కకు తీయించారు. బాధితులకు న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో గంట తర్వాత ఆందోళన విరమించారు. ఆందోళన సమయంలో బాధితుల్లో ఒకరు ట్రాఫిక్‌లో చిక్కున్న ఆర్టీసీ బస్సు అద్దాన్ని పగలగొట్టారు.