మేడారం ఫారెస్ట్‌‌‌‌ పునరుద్ధరణకు ఐదేండ్ల ప్రణాళిక

  • 800 ఎకరాల్లో కూలిన చెట్ల స్థానంలో కొత్తవి నాటేందుకు చర్యలు
  • అగ్ని ప్రమాదాలు జరగకుండా, పశువులు రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు
  • మొక్కల రక్షణకు పది మంది గిరిజన యువకుల నియామకం
  • ప్రభుత్వానికి నివేదిక పంపిన ములుగు డీఎఫ్‌‌‌‌వో రాహుల్‌‌‌‌ కిషన్‌‌‌‌ జాదవ్‌‌‌‌

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు : ఇటీవల భారీ స్థాయిలో దెబ్బతిన్న మేడారం ఫారెస్ట్‌‌‌‌ను పునరుద్ధరించేందుకు ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు తగిన ప్రణాళిక రూపొందించారు. అటవీ సంరక్షణ కోసం ఐదేండ్ల పాటు పాటు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. 800 ఎకరాల్లో పడిపోయిన చెట్ల ప్లేస్‌‌‌‌లో కొత్త మొక్కలు నాటడంతో పాటు అగ్ని ప్రమాదాలు జరగకుండా, పశువులు రాకుండా చైన్‌‌‌‌ లింక్‌‌‌‌ల ఏర్పాటు, కాపలాకు పది మంది గిరిజన యువకుల నియామకం వంటి అంశాలను పేర్కొంటూ ములుగు డీఎఫ్‌‌‌‌‌‌‌‌వో రాహుల్‌‌‌‌ కిషన్‌‌‌‌ జాదవ్‌‌‌‌  ఇటీవల ప్రభుత్వానికి రిపోర్ట్‌‌‌‌ పంపించారు. నిధులు మంజూరు కాగానే పనులు స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తామని ఆయన చెప్పారు.

ఆగస్టు 31న వందల ఎకరాల్లో కూలిన చెట్లు

ములుగు జిల్లాలోని ఏటూరునాగారం అభయారణ్యం పరిధిలో గల తాడ్వాయి మండలంలో ఆగస్టు 31వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల మధ్య ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. తెల్లవారి చూసేసరికి తాడ్వాయి ‒ మేడారం రూట్‌‌‌‌‌‌‌‌లో రోడ్డుకు ఇరువైపులా అర కిలోమీటర్‌‌‌‌ రేడియస్‌‌‌‌తో 2 కిలోమీటర్ల పొడవునా 800 ఎకరాల విస్తీర్ణంలో 50 వేలకు పైగా చెట్లు నేలకూలి కనిపించాయి. 

పక్కనే ఉన్న విద్యుత్‌‌‌‌‌‌‌‌ స్థంభాలు సైతం విరిగిపడ్డాయి. పెద్ద, పెద్ద చెట్లు వేర్లతో సహా విరిగి నేలకొరిగాయి. పక్కనే ఉన్న కొండపర్తి గ్రామంలో సుమారు 16 ఇండ్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. చెట్లు కూలిపోవడాన్ని గమనించిన ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో డ్రోన్‌‌‌‌ కెమెరాల ద్వారా కూలిపోయిన చెట్లను గుర్తించారు. కూలిన చెట్లన్నీ ఒక వైపే పడి ఉండడం,  భారీ వృక్షాలు సైతం వేర్లతో సహా నేలకొరడంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడమే కారణం కావచ్చొని ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 4, 5వ తేదీల్లో పీసీసీఎఫ్‌‌‌‌‌‌‌‌ ఆరెం డోబ్రియల్‌‌‌‌‌‌‌‌, కాళేశ్వరం జోన్‌‌‌‌‌‌‌‌ సీసీఎఫ్‌‌‌‌ ప్రభాకర్‌‌‌‌‌‌‌‌, భద్రాద్రి సర్కిల్‌‌‌‌ సీసీఎఫ్‌‌‌‌‌‌‌‌ భీమానాయక్‌‌‌‌‌‌‌‌, ములుగు డీఎఫ్‌‌‌‌‌‌‌‌వో రాహుల్‌‌‌‌ కిషన్‌‌‌‌ జాదవ్‌‌‌‌లు క్షేత్రస్థాయిలో పర్యటించి నేలకొరిగిన వృక్షాలను పరిశీలించారు. 

అటవీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌‌‌‌ కోసం సిఫారసు

తాడ్వాయి సమీపంలోని అడవిలో సుమారు 120 జాతులకు సంబంధించిన చెట్లు పడిపోయాయని ఆఫీసర్లు గుర్తించారు. వీటి పునరుద్దరణ కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ములుగు డీఎఫ్‌‌‌‌వో రాహుల్‌‌‌‌ కిషన్‌‌‌‌ జాదవ్‌‌‌‌ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దెబ్బతిన్న అటవీ పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడమే లక్ష్యంగా ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు పంచవర్ష ప్రణాళికను రూపొందించారు. నేలకూలిన చెట్లు, ఎండిన జీవపదార్ధాల కారణంగా అగ్ని ప్రమాదాలు జరగకుండా దెబ్బతిన్న అడవి చుట్టూ 80 కిలోమీటర్ల పొడవునా ఐదు మీటర్ల వెడల్పుతో ఫైర్​ లైన్‌‌‌‌ను రూపొందించాలని ప్రతిపాదించారు. 

మానవ కదలికలు నియంత్రించడంతో పాటు ఆక్రమణలను అడ్డుకునేందుకు చైన్‌‌‌‌ లింక్‌‌‌‌ కంచెను నిర్మించాలని ప్రపోజల్స్‌‌‌‌ పంపించారు. అలాగే అటవీ సంరక్షణ, అగ్ని ప్రమాద నివారణ మరియు ప్లాంటేషన్‌‌‌‌ నిర్వహణలో శిక్షణ పొందిన 10 మంది స్థానిక గిరిజన యువకులను క్షేత్రస్థాయిలో ఉంచి రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. 

చెట్లను తొలగించే పనులు జరుగుతున్నాయి 

మేడారం అడవుల్లో కూలిపోయిన చెట్ల తొలగింపు ప్రక్రియ జరుగుతోంది. మేడారం అటవీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాం. నిధులు మంజూరు కాగానే పనులు మొదలుపెడతాం.

- రాహుల్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌ జాదవ్‌‌‌‌‌‌‌‌, ములుగు జిల్లా అటవీశాఖాధికారి-