మొన్నటి వరదలకు మేడారం ఆగమాగం అయ్యింది. జంపన్నవాగు వరదలతో గ్రామం నీట మునిగి మేడారం గద్దెలను తాకింది. వరదలొచ్చి నెల రోజులు దాటినా మేడారం ఇంకా కోలుకోలేదు. వరదలకు కొట్టుకపోయిన అంతర్గత రోడ్లు అలాగే కన్పిస్తున్నాయి. కూలిపోయిన బ్రిడ్జిలు రిపేర్ చేయలేదు. హరిత కాకతీయ హోటల్ పూర్తిగా దెబ్బతింది. కలెక్టర్, ఎస్పీ వంటి ఉన్నతాధికారులు బస చేసే ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్ బురదతోనే నిండి ఉంది. నేలపై పడిన కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు కిందనే ఉన్నాయి. త్రీఫేజ్ కరెంట్ సప్లై లేదు. మేడారంలో వరదల వల్ల రూ.20 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. అయినా సర్కారు నుంచి స్పందన లేదు. ఇంకా రిపేర్ పనులు మొదలు కాలేదు. మరో ఐదు నెలల్లో మేడారం మహా జాతర మొదలుకానుంది.
మహా జాతర కంటే ముందు నుంచే భక్తుల రాక
వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 మధ్య మేడారం మహాజాతర జరుగనుంది. దేశం నలుమూలల నుంచి కోటి మందికి పైగా భక్తులు తరలివస్తారు. అయితే కొన్నేళ్లుగా మహాజాతర కంటే ముందు నుంచే భక్తులు మేడారం రావడం ఆనవాయితీగా వస్తోంది. జాతర టైంలో పిల్లలతో వచ్చి మొక్కులు తీర్చుకోవడం ఇబ్బందిగా భావించిన వాళ్లు ముందుగానే వస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రతీ ఆదివారం భారీగానే భక్తులు వచ్చి మొక్కులు సమర్పిస్తుంటారు. అయితే ఇలా వచ్చే భక్తులకు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్తున్నారు.
దెబ్బతిన్న రోడ్లు.. వంతెనలు
మేడారం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వందల కి.మీ పొడవునా అంతర్గత రోడ్లు నిర్మించారు. ఇవన్నీ కూడా మొన్నటి వరదలకు కొట్టుకుపోయాయి. జంపన్నవాగుకు పోయే దారిలో, గ్రామ పంచాయతీ దగ్గర, హరిత కాకతీయ హోటల్, నార్లాపూర్, ఊరట్టం, వెంగళనగర్ తదితర ప్రాంతాల్లో వేసిన సీసీ రోడ్లు, బీటీ రోడ్లు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. జంపన్నవాగుపై నిర్మించిన జంట బ్రిడ్జిలకు కూడా వరదల వల్ల నష్టం కలిగింది. అలాగే జంపన్నవాగుపై నిర్మించగా కూలిపోయిన మొట్లగూడెం బ్రిడ్జి, కుంగిపోయిన గోనెపల్లి బ్రిడ్జిని మహా జాతర నాటికి రిపేర్ చేయాల్సి ఉంది.
తీరని కరెంట్ కష్టాలు
మేడారంలో ఇంకా కరెంట్ కష్టాలు తీరలేదు. త్రీ ఫేజ్ కరెంట్ రాక మోటార్లు పనిచేయట్లేదు. మేడారం మహాజాతర కోసం గద్దెల నుంచి నాలుగు దిక్కులా ఎటూ 20 కి.మీ దూరం వరకు వేసిన కరెంట్ స్తంభాలలో దాదాపు 2 వేలకు పైగా కూలిపోయాయి. అలాగే రెండు వందలకు పైగా ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వీటిని వెంటనే రిపేర్ చేసి త్రీ ఫేజ్ కరెంట్ సప్లై పునరుద్ధరించాలి. ఇందుకోసం రూ.4 కోట్లకు పైగా ఖర్చువుతుందని విద్యుత్ శాఖ ఆఫీసర్లు లెక్కలేశారు.
నీళ్లు లేక భక్తులు ఇబ్బంది పడ్తున్నరు..
అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు నీళ్లు లేక ఇబ్బంది పడ్తున్నరు. భక్తులు గుడి లోపలికి పోయే ముందు కాళ్లు కడుక్కోవడానికి కూడా నీళ్లు ఉండట్లేదు. మేడారంలోని ప్రజలు కరెంటు లేక తాగునీరు అందక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తులు విడిది చేసే సత్రాలలో కరెంటు లేక నీళ్లు రావట్లేదు.
‒ తాళ్లపల్లి లక్ష్మణ్, మేడారం, ములుగు
రోడ్లు రిపేర్ చేయాలి!
జంపన్నవాగు వరదల వల్ల మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా రోడ్లు దెబ్బతిన్నాయి. వీటిని వెంటనే రిపేర్ చేయాలి. అలాగే వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలి. మేడారంలోని షాపుల్లోకి బురదనీరు రావడం వల్ల రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. వారికి ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలి. ఇప్పుడిప్పుడే మేడారానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వీరికి సౌకర్యాలు కల్పించాలి.
- చర్ప తులసి రావు, ఊరట్టం, ములుగు