- సీల్ తీయని 100, 200 నోట్ల కట్టలు వేసిన భక్తులు
- ఫస్ట్ డే వచ్చింది రూ.కోటి ముప్పై నాలుగు లక్షల అరవై వేలు
- డిజిటల్‍హుండీల ద్వారా రూ.3.04 లక్షల ఇన్‌కం
- లెక్కించినవి 65..మిగిలినవి 432
మేడారం జాతరలోని హుండీల్లో భక్తులు తమకు తోచిన రీతిలో కానుకలు వేశారు. రూ.5 నుంచి మొదలుకుంటే 10, 20, 50, 100, 500, రూ.2 వేల నోటు వరకు అమ్మవార్లకు సమర్పించుకున్నారు. కొందరు సీల్ తీయని రూ.100, రూ.200 కొత్త కరెన్సీ కట్టలను వేశారు. ఇంకొందరైతే బంగారు తాళిబొట్లు, గాజులు, వెండితో చేసిన కుంకుమ భరిణెలు, అమ్మవారి ప్రతిమలు, కడియాలు, ఊయలలు, నాగుపాము ఆకారాలను కానుకలుగా ఇచ్చుకున్నారు. పీటలు లాంటివైతే కుప్పలు తెప్పలుగా వచ్చాయి. విదేశాల నుంచి వచ్చిన వారు డాలర్స్ వేశారు.
వరంగల్, వెలుగు: మేడారం సమ్మక్క, సారక్క జాతర హుండీల్లోని కానుకల లెక్కింపు బుధవారం మొదలైంది. హన్మకొండ పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో హుండీల వద్ద ఎండోమెంట్ ఆఫీసర్లు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు మొదలు పెట్టి సాయంత్రం 6 గంటల వరకు లెక్కించారు. మొదటి రోజు రూ.1,34,60,000 వచ్చాయి. జాతరలో డిజిటల్ హుండీలు ఏర్పాటు చేయగా.. 816 మంది భక్తులు క్యూఆర్ కోడ్, ఫోన్ పే , గూగూల్ పే ద్వారా రూ.3 లక్షల 4 వేలను ట్రాన్స్ఫర్ చేశారు. ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు.
ఓపెన్ చేసినవి 65 ..
జాతరలో మొత్తం 497 హుండీలు ఏర్పాటు చేయగా, ఇందులో 450 ఐరన్, 44 క్లాత్, 3 బియ్యం కానుకలు వేసే హుండీలు ఉన్నాయి. బుధవారం 65 హుండీలను ఓపెన్ చేశారు. లెక్కింపు సందర్భంగా కొంతమంది పెళ్లి బంతుల్లో మాదిరి , మరికొందరు కింద కూర్చొని నోట్లను లెక్కపెడుతూ 50, 100 , 200, 500, 2000 లుగా కట్టలు కట్టారు. నోట్లను స్పీడ్‌గా లెక్కించడానికి యూనియన్, హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంకుల సహకారంతో మనీ కౌంటింగ్ మెషీన్లను తెప్పించారు. డబ్బులను ఎప్పటికప్పుడు ఎండోమెంట్ అకౌంట్లో జమ చేశారు. గోల్డ్, సిల్వర్ జ్యువెల్లరీని సపరేట్బాక్సుల్లో పెట్టారు. ఓ టీం పసుపు, కుంకుమ అంటిన నోట్లను క్లీన్ చేయగా, మరో టీం హుండీల్లోని బియ్యం, చిల్లర పైసలను వేరు చేసింది.
లుంగీ ..బనియన్ ఓన్లీ
భక్తులు వేసిన కానుకలను లెక్కించడానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్200 మంది సిబ్బందితో పాటు మరో 600 నుంచి 1000 మంది సేవలను వినియోగించుకుంటోంది. మొదటిరోజు లెక్కింపులో 300 మంది మాత్రమే పాల్గొన్నారు. ఇందులో 100 మంది మహబూబాబాద్‍కు చెందిన శ్రీలక్ష్మి వెంకటేశ్వర సేవా సమితి నుంచి వచ్చారు. మహిళలు చీరలు కట్టుకుని రాగా, మగవారిని లుంగీ, బనియన్‍తో మాత్రమే కౌంటింగ్‍హాల్లోకి అనుమతించారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు.