కన్నెపల్లి కల్పవల్లి.. ఈ రాత్రే మేడారం గద్దెకు

మేడారం టీం: మేడారం భక్త జనసంద్రమైంది. ఈ రాత్రికి కన్నెపల్లి కల్పవల్లి సారలమ్మ గద్దెకు చేరుకోవడంతో మహాజాతరకు అంకురార్పణ జరుగుతుంది. ఇవాళ ఉదయం 11 గంటల సమయంలో కన్నెపల్లి ఆలయంలో వడ్డెలు(పూజారులు) ప్రత్యేక పూజలు చేశారు. పూజారి కాక సారయ్య, కాక కిరణ్​ కన్నెపల్లిలోని ఆలయంలో కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న అమ్మవారిని మేడారానికి తీసుకొని బయల్దేరుతారు. లక్షలాది మంది భక్తులు సారలమ్మకు ఆహ్వానించేందుకు ఇప్పటికే మేడారానికి చేరుకున్నారు. 

జంపన్నవాగులో పుణ్యస్నానాల కోసం భారీ సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. మరో వైపు పుణ్యస్నానాలు ఆచరించి గద్దెకు చేరుకొనే దారిలో ట్రాఫిక్ జాం ఏర్పడింది. నిన్న సాయంత్రం పూనుగొండ్లలో బయల్దేరిన సమ్మక్క భర్త పగిడిద్దరాజును పస్రా మీదుగా మేడారం తీసుకువస్తున్నారు. సారలమ్మ భర్త గోవిందరాజు నిన్న కొండాయి నుంచి బయల్దేరగా కొత్తగూడెం దాటినట్టు తెలుస్తోంది. ఈ రాత్రికి ఈ మగ్గురు.. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవింద రాజు మేడారం గద్దెలకు చేరుకుంటారు. దీంతో మహాజాతర ప్రారంభమవుతుంది.