Medaram Jatara 2024: హమ్మయ్య..ఎడ్ల బండ్లు కనిపించినయ్​

మేడారం నెట్​వర్క్​, వెలుగు:  గద్దెలపై కొలువుదీరిన సమ్మక్కసారక్కలను దర్శించుకునేందుకు మూడోరోజు మేడారానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కిక్కిరిసిన క్యూలైన్లలో  గంటల తరబడి వేచిచూసి మరీ అమ్మలకు మొక్కులు అప్పజెప్పారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించి, నేరుగా దర్శనానికి వచ్చారు. ఎత్తు బెల్లం, ఒడిబియ్యం, సారె, చీరెలు సమర్పించి, పిల్లాజెల్లా, గొడ్డుగోదను చల్లంగ చూడాలని వేడుకున్నారు. శుక్రవారం ఏకంగా 50 లక్షల మంది భక్తులు రావడంతో గద్దెల వద్ద తీవ్ర రద్దీ నెలకొన్నది. అయితే మేడారం జాతరలో ఈ సారి ఎడ్ల బండ్లు హల్ చల్ చేశాయి.

ఒకప్పుడు మేడారం సమ్మక్క జాతరలో ఎడ్లబండ్లదే హవా. పదేండ్ల కింది వరకు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా గిరిజనులు కుటుంబాలతో ఎడ్లబండ్లలో జాతరకు వచ్చేవారు. రోజుల తరబడి ప్రయాణించి మేడారం చేరుకొని నాలుగురోజులు ఇక్కడే బస చేసి తిరిగి  వెళ్లేవారు. పది, పదిహేను రోజులకు సరిపడా గ్రాసం వెంట తెచ్చుకునేవారు. కాలక్రమంలో ఆటోలు, ట్రాక్టర్ల వల్ల ఎడ్ల బండ్లను తగ్గించారు. చుట్టుపక్కల కొన్ని అటవీగ్రామాల నుంచి ఇప్పటికీ కొందరు ఎడ్ల బండ్లలో వస్తుంటే ట్రాఫిక్​ పేరిట పోలీసులు అడ్డుకుంటున్నారు.  దీంతో కొన్నేండ్లుగా మేడారం జాతరలో ఎడ్ల బండ్లు అరుదుగా కనిపిస్తున్నాయి.