- ఇంకా పూర్తికాని టెండర్ ప్రాసెస్
- మరుగుదొడ్లు, రోడ్ల రిపేర్స్‌కు భారీగా నిధులు
- పనులు ప్రారంభించని అధికారులు, ఇంజినీర్లు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు సమయం దగ్గర పడుతోంది. ఇంకా 47 రోజుల టైమ్ మాత్రమే ఉంది. ఇప్పటికే ప్రతి ఆది, బుధవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో హాజరై వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయినా మేడారంలో ముఖ్యమైన శాఖల అభివృద్ధి పనులు ఇంకా మొదలు కాలేదు. రూ.75 కోట్ల ఫండ్స్మంజూరై18 రోజులు గడుస్తున్నా టెండర్ ప్రక్రియ పూర్తి చేయలేదు. సర్కారు మారినా, వివిధ శాఖలకు సంబంధించిన ఇంజినీర్లు ఎప్పటిలాగే జాతర ముందు హడావుడి చేద్దామని పనులు ఇంకా మొదలు పెట్టలేదు. నాలుగు రోజుల పాటు జరిగే మహా జాతరకు కోటి మంది భక్తులు హాజరవుతారని అంచనా. కానీ మేడారం పరిసరాలను పరిశీలిస్తే ఎక్కడి సమస్యలు అక్కడే కనిపిస్తున్నాయి.
ఇంజినీరింగ్ పనులు మొదలుకాలే
ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే మేడారంసమ్మక్క సారలమ్మ మహా జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లు నిధులు కేటాయిస్తూ గత నెల15వ తేదీన జీవో ఇచ్చింది. వీటిలో అత్యధికంగా ఇంజినీరింగ్ శాఖలకే పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. అత్యధికంగా గ్రామీణ నీటి సరఫరా శాఖకు రూ.14.74 కోట్లు, ఐటీడీఏ ఇంజినీరింగ్ శాఖకు రూ.8.28 కోట్లు, జిల్లా పంచాయతీరాజ్ శాఖకు రూ.7.84 కోట్లు, మైనర్ ఇరిగేషన్‌కు రూ.6.11 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు రూ.4.35 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.4 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.3.96 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ.2.80 కోట్లు కేటాయించారు. వీటితో భక్తులకు శాశ్వతంగా ఉపయోగపడే పనులతో పాటు రిపేర్ వర్క్స్ కూడా ఉన్నాయి. అయితే ఆయా డిపార్ట్‌మెంట్ల ఇంజినీర్లు త్వరితగతిన టెండర్ ప్రాసెస్ పూర్తి చేసి ఇప్పటికే ఫీల్డ్‌లో వర్క్స్ స్టార్ట్ చేయాల్సి ఉంది. కానీ ఇంకా ఆయా శాఖల్లో టెండర్ ప్రాసెస్ పూర్తికాలేదు. తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం, వాటర్‌ట్యాప్‌ల ఏర్పాటు, తాగునీటి సరఫరా, పారిశుధ్య పనుల విషయంలో ప్రతీ జాతరలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
రోడ్ల రిపేర్ల కోసం కేటాయింపులు
సమ్మక్క సారలమ్మ మహా జాతరలో రోడ్లదే కీలకపాత్ర. రోడ్లు వెడెల్పుగా ఉంటే ట్రాఫిక్‌జామ్‌లు ఉండవు. కానీ ఇటీవల వచ్చిన వరదలకు గతంలో వేసిన ప్రధాన రోడ్లతో పాటు ఇంటర్నల్రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. తాడ్వాయి ‒ మేడారం, నార్లాపూర్‒ మేడారం, కాటారం ‒ మేడారం ప్రధాన రహదారులు గుంతలు పడి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. మేడారం పరిసర ప్రాంతాల్లోని అంతర్గత బీటీ రోడ్లు, సీసీ రోడ్లు వరదలకు కొట్టుకుపోయాయి. పస్రా ‒ నార్లాపూర్ రోడ్డు రిపేర్ కోసం రూ.70 లక్షలు, తాడ్వాయి‒ నార్లాపూర్ రోడ్డు రిపేర్ కోసం రూ.కోటి, చింతల్ క్రాస్ నుంచి మేడారం వరకు రూ.2.85 కోట్లు, కాల్వపల్లి క్రాస్ నుంచి కాల్వపల్లి వరకు రూ.2.10 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి చెల్పాక వరకు రూ.1.35 కోట్లు, కొత్తూరు నుంచి కన్నెపల్లి వరకు రూ.72 లక్షలు, మేడారంలోని స్తూపం దగ్గరి నుంచి ఊరట్టం వరకు కేవలం ఒక కి.మీ రోడ్డు రిపేర్స్ కోసం రూ.95 లక్షలు, కొంగల మడుగు నుంచి రెడ్డి గూడెం వరకు 600 మీటర్ల రోడ్డు రిపేర్ కోసం రూ.80 లక్షలు, చింతల్ క్రాస్ రోడ్డు నుంచి మేడారం వరకు 5 కి.మీ రోడ్డు రిపేర్స్ కోసం రూ.50 లక్షలు, కొత్తూరు నుంచి కన్నెపల్లి వరకు 1.4 కి.మీ రోడ్డు రిపేర్స్ కోసం రూ.70 లక్షలు కేటాయించారు. ఇవీ కాక ఇంకా అంతర్గత రోడ్ల రిపేర్స్ పేరిట కూడా పెద్దమొత్తంలో నిధులు కేటాయించారు. ఈ పనులు క్వాలిటీగా జరగాలంటే కనీసం 6 నెలల ముందు స్టార్ట్ చేయాలి. ఎన్నికల వల్ల ఇప్పటికే ఆలస్యం కాగా, ఆ వెంటనే పనులు స్టార్ట్ చేస్తే బాగుండేదని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
క్రాస్ బండ్స్ కోసం రూ.1.10 కోట్ల కేటాయింపు
జంపన్నవాగులో భక్తుల సౌకర్యం కోసం నీళ్లను ఆపాలనే ఉద్దేశంతో గతంలో రూ.12 కోట్లతో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ 3 చెక్ డ్యాంలు నిర్మించింది. వీటిలో ఒకటి ఏడాదిలోపే వరదలకు కొట్టుకుపోగా మిగతా రెండింటిని పనికిరావంటూ రూ.50 లక్షలు ఖర్చుపెట్టి మరీ తొలగించారు. ఇప్పుడు మళ్లీ ఈ సారి జంపన్నవాగులో క్రాస్ బండ్స్ పేరిట రూ.1.10 కోట్లతో ఇసుక బస్తాలు నింపి నీటిని ఆపుతామని ఇంజినీర్లు చెబుతున్నారు. అలాగే జంపన్నవాగులో ఇసుక తొలగింపు కోసం రూ.96 లక్షలు కేటాయించారు. వీటికోసం టెండర్లు కూడా పిలిచారు. ఇరిగేషన్ శాఖ చేసే పనులేమిటో అంతుపట్టడం లేదు. వాటర్ ట్యాప్స్ ఏర్పాటు కోసం రూ.2.16 కోట్లు కేటాయించారు.
అటకెక్కిన అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ
మేడారంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా ఉండటం లేదు. భక్తులు ఉపయోగించిన నీరంతా రోడ్లపైనే పారుతోంది. దీంతో భక్తుల నివాస ప్రాంతమంతా బురదమయమవుతోంది. అంటురోగాలు ప్రబలుతాయి. ఈ సారి అలా కాకుండా జాతర ప్రాంగణంలో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు ఇంజినీర్లు ఎలాంటి ఏర్పాట్లు చేయట్లేదు.
మరుగుదొడ్లు నిర్మించేదెన్నడు?
మేడారం జాతరకు కోటి మంది భక్తులు హాజరవుతున్నా ఇప్పటివరకు శాశ్వత మరుగుదొడ్లులేవు. జాతర జరిగే సమయంలో ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి తాత్కాలిక మరుగుదొడ్లు కట్టించడం ఆనవాయితీగా మారింది. ఓ వైపు జాతర జరుగుతుంటే మరోవైపు అప్పటికప్పుడు భూమిలో గుంతలు తవ్వి బేసిన్లు వేసి తడకలు కట్టి అవే మరుగుదొడ్లుగా ఆఫీసర్లు చూపిస్తుంటారు. అక్కడ కనీసం నీటి సదుపాయం ఉండదు. జాతర అయిపోయాక తడకలు తీసేసి బేసిన్లపైనే మట్టి పోసి పూడ్చేసి మమ అనిపిస్తున్నారు. ఈసారి కూడా ఇలాగే ఉంటుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. మేడారం జాతర పరిసరాల్లో ఎనిమిది చోట్ల తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం పేరిట రూ.5.20 కోట్లు కేటాయించారు. కానీ ఇప్పటి వరకు ఆర్‌డబ్ల్యుఎస్ డిపార్ట్‌మెంట్ ఒక్క చోట కూడా పనులు మొదలుపెట్టలేదు. సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లే భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడాల్సి ఉంటుంది. ఆ సమయంలో భక్తులకు మూత్ర, మల విసర్జన వస్తే వెళ్లేందుకు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయట్లేదు. శాశ్వత మరుగుదొడ్లు పెద్ద సంఖ్యలో నిర్మిస్తే తప్పతమ ఇబ్బందులు తొలగవని భక్తులు అంటున్నారు.